పెళ్లి కాలేదు.. కూతురి వయసు 18 ఏళ్లు

0Miss-Universe-shows-her-sofమాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ కు అప్పుడే 41 ఏళ్లు వచ్చేశాయి. కానీ ఇప్పటిదాకా ఆమె పెళ్లే చేసుకోలేదు. ఐతే పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ఆమె తల్లి కాకుండా ఏమీ లేదు. ఆమెకు పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్లున్నారు. వాళ్లిద్దరూ సుస్మితాసేన్ సొంత పిల్లలేమీ కాదు. సుస్మితా పెళ్లి చేసుకోకపోయినప్పటికీ చాలా ఏళ్ల కిందటే ఇద్దరు అమ్మాయిల్ని దత్తత తీసుకుంది. చిన్నతనం నుంచి వాళ్ల బాగోగులు చూస్తోంది. ఇద్దరినీ సొంత కూతుళ్ల లాగే చూస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరైనా రెనీకి 18 ఏళ్లు నిండిపోయాయి. ఆమె మేజర్ అయింది. రెనీ 18వ పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా సుస్మిత తనతో కలిసి పార్టీ చేసుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

ఈ ఫొటో పెట్టి ఒక ఆసక్తికర వ్యాఖ్య జోడించింది సుస్మిత. ‘‘మా ఇద్దరికీ ఇప్పుడు 18 ఏళ్లు. నా ఫస్ట్ లవ్ రెనీకి నిన్న 18 ఏళ్లు వచ్చాయి. అలాగే ఓ అమ్మగా నాకూ 18 ఏళ్లు నిండాయి. హ్యాపీ బర్త్ డే రెనీ. పెద్దదానివైపోయావు. నువ్వెప్పుడూ ఇలాగే ఆరోగ్యంగా.. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని సుస్మితా సేన్ వ్యాఖ్యానించింది. సుస్మిత రెండో కూతురి పేరు అలీసా. తన ఇద్దరు కూతుళ్లను సుస్మిత సినీ రంగంలోకి తీసుకురావాలని కోరుకుంటోంది. 1994లో విశ్వ సుందరిగా ఎంపికైన సుస్మితా సేన్.. ఆ తర్వాత బాలీవుడ్లోకి వచ్చి మంచి పేరే సంపాదించింది. తెలుగులో అక్కినేని నాగార్జున సరసన సుస్మిత ‘రక్షకుడు’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ నటిగా అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది సుస్మిత.