అల్లరి నరేష్ – ఎస్వీ కృష్ణారెడ్డి కాంబో

0

టాలీవుడ్ లో అత్యంత వేగంగా 50 సినిమాలు పూర్తి చేసిన హీరో అల్లరి నరేష్. కెరీర్ లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్లు ఉన్నా.. పరాజయాలు ఇబ్బంది పెట్టాయి. గత ఐదారేళ్లుగా నరేష్ కెరీర్ డైలమా గురించి తెలిసిందే. మేటి ప్రతిభావంతుడిగా పేరున్నా నటనలో మోనోటనీ అతడి కెరీర్ ని బ్యాక్ బెంచీకి పరిమితం చేసిందన్న విమర్శలు ఉన్నాయి. అల్లరి రవిబాబు కాంబినేషన్ లో `లడ్డు బాబు` లాంటి ప్రయోగాలు చేసినా మిస్ ఫైరవ్వడం అతడికి పెద్ద మైనస్ అయ్యింది. చేసిన ప్రయోగాలేవీ సరైన సక్సెస్ ని ఇవ్వలేదు. కారణం ఏదైనా నరేష్ లో చాలా వరకూ రియలైజేషన్ కనిపిస్తోంది.

ప్రస్తుతం అతడు కెరీర్ పరంగా రూటు మార్చి మల్టీస్టారర్లకు సంతకాలు చేస్తూ లైమ్ లైట్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇదివరకూ సునీల్ తో కలిసి `సిల్లీ ఫెలోస్` చిత్రంలో నటించాడు. అయితే ఆ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందించలేదు. ప్రస్తుతం మహేష్ తో కలిసి `మహర్షి` చిత్రంలో నటించాడు. మే 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇందులో నరేష్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. మహర్షి అతడికి పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుందని.. కెరీర్ ని కీలక మలుపు తిప్పుతుందని ఆశిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నరేష్ సన్నివేశమేంటి? అంటే.. అతడు నటించే సినిమాల లైనప్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉందని తెలుస్తోంది. పలువురు దర్శకనిర్మాతలు అతడిని స్క్రిప్టులతో సంప్రదిస్తున్నారట.

నరేష్ తో ప్రస్తుతం సోలో హీరోగా సినిమాలు తీసేకంటే ఇతర హీరోల కాంబినేషన్లతో సినిమాలు తీసేందుకు మన దర్శకనిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. ఆ తరహా కథాంశాల్ని ఏరికోరి రచయితలతో రాయిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం.. అల్లరి నరేష్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణా రెడ్డి ఓ సినిమాని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో వేరొక ప్రముఖ హీరో కూడా నటిస్తారని ఇదో మల్టీస్టారర్ తరహా అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్వీఆర్ మీడియా అధినేత శోభారాణి నిర్మించనున్నారు. ఇలయదళపతి విజయ్ హీరోగా నటించిన తుపాకి.. పులి వంటి భారీ అనువాద చిత్రాల్ని తెలుగులో రిలీజ్ చేసింది ఈ సంస్థనే. నేనే అంబానీ.. మరియాన్ వంటి అనువాద చిత్రాల్ని సదరు సంస్థ తెలుగులోకి అనువదించింది. సుమారు 50 పైగా ఆంగ్ల- తమిళ అనువాద చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సంస్థ ఇది. కొంత గ్యాప్ తర్వాత నరేష్ ని వేరొక హీరోతో కలిపి మల్టీస్టారర్ తరహా చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహకాల్లో ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉందింకా. ఇక ఇదే బ్యానర్ లో ఐదుగురు కథానాయికలతో ఓ సినిమా ఉంటుందని తెలుస్తోంది. వేరొక మీడియం బడ్జెట్ ప్లానింగ్ లో ఉందట. ఇక మహర్షి రిలీజ్ తర్వాత ఈ సినిమాతో పాటు నరేష్ నుంచి మరిన్ని ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Please Read Disclaimer