సెలెబ్రిటీలను వద్దన్న స్వాతి!

0టీవీ ఛానల్స్ ఇన్నేసి లేని రోజుల్లో టీనేజ్ వయసులోనే ఒక టాక్ షోతో తన ఇంటి పేరును మార్చేసుకున్న కలర్స్ స్వాతి గురించి తెలియని టీవీ సినిమా ప్రేక్షకులు దాదాపు ఉండరు. సన్నగా ఉన్నా చాలా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అదోరకమైన మేజిక్ చేసే స్వాతి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లో చేసిన పాత్ర పెద్ద గుర్తింపు ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా సైతం స్వామి రారా లాంటి సినిమాలతో గట్టి హిట్స్ కొట్టింది. ఇన్ని రోజులు పెళ్లి గురించి మాటెత్తని స్వాతి సడన్ గా హడావిడి లేకుండా పెళ్లి చేసుకోవడం అందరిని స్వీట్ షాక్ కి గురి చేసింది. దానికి కారణం లేకపోలేదు. మాములుగా ఒక చిన్న నటుడి పెళ్లి అన్నా తారాలోకం మొత్తం కదిలి వస్తోంది. అలాంటిది ఇంత అనుభవం పరిచయాలున్న స్వాతి రెడ్డి పెళ్లిలో ఏ సెలబ్రిటీ కనిపించకపోవడం నిజంగా ఆశ్చర్యమే – నిజానికి స్వాతి కావాలనే ఈ నిర్ణయం తీసుకుందట. లైవ్ కెమెరాలు పెట్టి పెళ్లిలో క్షణాలన్నీ కృత్రిమంగా మార్చే పద్ధతి కంటే తనకు కావలసిన కుటుంబ సభ్యులు. స్నేహితుల మధ్యే జరుపుకోవడం సంతోషాన్ని ఇచ్చిందట.

ఇదే ప్రస్తావన సినిమా ఫ్రెండ్స్ స్వాతి వద్దకు తెచ్చినప్పుడు జీవితంలో ఈ మధుర ఘట్టాన్ని మనసారా ఆస్వాదిస్తున్నానని చెబుతోంది. ప్రస్తుతం విదేశాల్లో స్థిరపడిపోయిన తన చిన్ననాటి స్నేహితులు కూడా వేడుక కోసం ఇంత దూరం రావడం పట్ల స్వాతి ఆనందం మాములుగా లేదు. వాళ్ళతోనే సంగీత్ బ్యాచిలర్ పార్టీ అన్ని చేసేసుకుంది. పూర్తి తెలుగు సంప్రదాయ పద్ధతిలో జరిగిన స్వాతి పెళ్లి తాలూకు ఫోటోలు ఆన్ లైన్ లో రచ్చ చేస్తున్నాయి. చూడముచ్చటగా ఉన్న జంటను చూసి షేర్ చేస్తున్న వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంది. ఇది చూసే స్వాతి ఇంకా ఖుషిగా ఉంది. నేరుగా రాకపోయినా తన పెళ్లి గురించి ఇందరు మాట్లాడుకోవడం దూరం నుంచే ఆశీర్వదించడం గురించి అందరికి చెప్పుకుని ఆనందపడుతోందట. సినిమా తారలకున్న అదృష్టం అదే మరి. మనకు సంబంధం లేని పరిచయం లేని వాళ్ళ ఆశీర్వాదాలు పొందే భాగ్యం దక్కుతుంది.