బాప్ రే! ఐష్ కి చెక్ పెట్టేసిన తాప్సీ!!

0మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ కి బ్యాడ్ టైమ్ నడుస్తోందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. తానొకటి తలిస్తే దైవమొకటి తలచిన చందంగా ఐష్ని ఇలా అవకాశం వరించి దూరంగా వెళ్లిపోతోంది. ప్రస్తుతం దీనిపై బాలీవుడ్ లో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. ఐశ్వర్యారాయ్ నటించిన జజ్బా – ఫనేఖాన్ చిత్రాలు జస్ట్ యావరేజ్ గా నిలిచాయి. దాంతో ఐష్ క్రేజు ఆటోమెటిగ్గా తగ్గిందనేది ట్రేడ్ లో ముచ్చట. అందుకు తగ్గట్టే ఎంతో ఆచితూచి దర్శకనిర్మాతలు అడుగులేస్తున్నారు. ఐశ్వర్యారాయ్ ని ఎంపిక చేసుకునేముందు ఆలోచిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. ఐశ్వర్యారాయ్ ఓ క్రేజీ ఆఫర్ని కోల్పోయిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ అమ్మడిని రీప్లేస్ చేస్తూ అందాల తాప్సీని కథానాయికగా ఎంచుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. శైలేష్ ఆర్.సింగ్ దర్శకత్వం వహిస్తున్న కాప్ డ్రామాలో అభిషేక్ బచ్చన్ సరసన తాప్సీ నాయికగా ఎంపికైంది. చివరి నిమిషంలో దర్శకుడు నాయికను మార్చడం చర్చకొచ్చింది.

వాస్తవానికి అభిషేక్ – ఐశ్వర్యారాయ్ జోడీ ఈ చిత్రంలో ఫైనల్ చేశారన్న చర్చ చాలా కాలంగా ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ మార్పు ఆశ్చర్యపరుస్తోంది. అయితే దర్శకుడి నుంచి తాప్సీకి కాల్ వెళ్లిందిట. అట్నుంచి తాప్సీ ప్రాజెక్టుపై సంతకం చేయాల్సి ఉందింకా. ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో తాప్సీ నటించనుందని తెలుస్తోంది. మరిన్ని అప్ డేట్స్ తెలియాల్సి ఉందింకా. పింక్ – నామ్ షబానా – ముల్క్ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన తాప్సీ.. ప్రస్తుతం ఉత్తరాదిన తన కెరీర్ గ్రాఫ్ ని అంతకంతకు పెంచుకుంటూ పోతోంది. తాజా రీప్లేస్ మెంట్ పెరిగిన తన ఇమేజ్ కి సూచిక అని విశ్లేషిస్తున్నారు.