నెక్స్ట్ ఏంటి తమన్నా..?

0

‘హమ్ తుమ్’.. ‘ఫనా’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి తెలుగులో ఒక సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తమన్నా.. సందీప్ కిషన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా చాలా రోజుల క్రితమే షూటింగ్ మొదలైనా ఎందుకో షూటింగ్ ప్రోగ్రెస్ గురించి పెద్దగా అప్డేట్లు రాలేదు. కానీ తాజాగా సినిమాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది.

ఈ సినిమాకు ‘నెక్స్ట్ ఏంటి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా మేకర్స్ వెల్లడించారు. అంతే కాదు ఈ సినిమానుండి రెండు స్టిల్స్ కూడా విడుదల చేశారు. ఒక స్టిల్ లో తమన్నా- సందీప్ లో ఉత్సాహంగా లండన్ వీధుల్లో స్టెప్స్ వేస్తుండగా మరో స్టిల్ లో సందీప్ – నవదీప్ కలిసి ఉన్నారు. ఈ సినిమాలో పూనం కౌర్.. లారిస్సా లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు నిర్మాత అక్షయ్ పూరి.

ఈ సినిమా మెజారిటీ భాగాన్ని లండన్ లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్.. టీజర్లను విడుదల చేస్తామని మేకర్స్ అంటున్నారు. డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ లో ఇప్పటికే సినిమాలు ప్యాక్ద్ గా ఉన్నాయి. మరి ఈ ‘నెక్స్ట్ ఏంటి’ కి స్లాట్ దొరుకుతుందో లేదో వేచి చూడాలి.