ఆ సినిమా తరుణ్ భాస్కర్ గ్యాంగ్ దేనట!

0తన మొదటి సినిమా “పెళ్లి చూపులు“తోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ జాతీయ స్థాయి అవార్డును అందుకున్నాడు. చిన్న సినిమాగా విడుదలైన పెళ్లిచూపులు….కేవలం మౌత్ టాక్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్లను తరుణ్ భాస్కర్ రిజెక్ట్ చేశాడు. చాలా గ్యాప్ తర్వాత `ఈ నగరానికి ఏమైంది ` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో రన్ అవుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వరుసగా రెండో సినిమా చేసిన తరుణ్…..తనపై సురేష్ బాబు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే రెండో సినిమా కోసం ఇంత గ్యాప్ ఇచ్చిన తరుణ్….తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. వాస్తవికతకు దగ్గరగా తీసిన పెళ్లిచూపులు తరహాలోనే….ఈ సినిమా కూడా తన జీవితంలోని ఘటనల ఆధారంగా అద్భుతంగా తెరకెక్కించాడు తరుణ్.

కాలేజీ రోజుల్లోనే తన స్నేహితులతో కలిసి తరుణ్ షార్ట్ ఫిలిమ్స్ తీసేవాడట. ఎప్పటికైన సినిమా తీయాలని అతడి కల. అయితే ప్రేమ విఫలం కావడం….ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎవరి ప్రొఫెషనల్ లైఫ్ లోకి వారు ఎంటరవడం…వంటి కారణాలతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. అయితే చాలా గ్యాప్ తర్వాత తన గ్యాంగ్ అంతా మళ్లీ కలిసి షార్ట్ ఫిలిం తీయడం….ఆ తర్వాత పెళ్లిచూపులు రూపంలో సినిమాకు చాన్స్ రావడం జరిగిపోయాయట. అందుకే తరుణ్ తన కథనే తన రెండో సినిమాగా తెరకెక్కించాలని సురేష్ బాబుకు చెప్పాడట. తరుణ్ సొంత కథ కావడంతో సురేష్ బాబు కూడా ఫస్ట్ స్క్రిప్ట్ నే ఓకే చేశారట. అందుకే ఈ సినిమా చివర్లో పెళ్లిచూపులు షూట్ జరుగుతుండగా….విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. ద్వితీయ విఘ్నం కూడా దాటేసిన తరుణ్ …తన మూడో సినిమా కోసం ఏ కథ ఎంచుకుంటాడో అన్నది ఆసక్తికరంగా మారింది.