ఈ నగరానికి ఏమైంది.. షోలు ఎందుకాపేశారు?

0తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ‘పెళ్ళిచూపులు’ విడుదలకు ముందు వరుసబెట్టి కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీ జనాలకు.. మీడియా వాళ్లకు స్పెషల్ షోలు వేసిన సంగతి తెలిసిందే. ఆ షోల నుంచి వచ్చి టాక్ బాగా స్ప్రెడ్ అయి సినిమాపై పాజిటివ్ బజ్ వచ్చింది. జనాలు థియేటర్లకు కదిలారు. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఓవరాల్ కలెక్షన్లు కూడా అంచనాల్ని మించాయి. సినిమా పెద్ద హిట్టయింది. తరుణ్ రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో కావాలనుకున్నారు. దీనికి కూడా స్పెషల్ షోలు మొదలుపెట్టారు. కానీ ఉన్నట్లుండి వాటికి బ్రేక్ పడిపోయింది. దీంతో సినిమా బాగా లేకపోవడం వల్ల నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుందేమో అని ఆపేశారేమో అన్న డిస్కషన్ నడిచింది. కానీ అలాంటిదేమీ లేదని అంటున్నాడు తరుణ్.

నిర్మాత సురేష్ బాబు సలహా మేరకే ఆ షోలు ఆపేసినట్లు అతను వెల్లడించాడు. దీని వెనుక కారణం చెబుతూ.. ‘‘పెళ్లిచూపులు తరహాలోనే స్పెషల్ ప్రివ్యూలు వేద్దామనుకున్నాం. రెండు షోలు పడ్డాయి. మంచి టాక్ వచ్చింది. కానీ సురేష్ బాబు గారు వచ్చి.. ఇక స్పెషల్ షోల అవసరం లేదని.. ఇప్పటికే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయిందని.. సినిమాకు మంచి బిజినెస్ కూడా జరిగిందని చెప్పారు. దీంతో షోలు ఆపేశాం. మా బృందం మొత్తానికి సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ‘పెళ్ళిచూపులు’ కంటే కూడా ఇది పెద్ద విజయం సాధిస్తుంది’’ అని తరుణ్ చెప్పాడు. స్టార్లతో కంటే కొత్త వాళ్లతోనే తాను కంఫర్ట్ బుల్ గా సినిమాలు తీయగలనని.. అందుకే రెండో ప్రయత్నంలో కూడా కొత్త వాళ్లతో సినిమా చేశానని తరుణ్ చెప్పాడు. సురేష్ బాబు వెనుక ఉండటంతో ఏ ఇబ్బందీ లేకుండా సినిమా పూర్తయిందని.. తన తర్వాతి చిత్రాన్ని కూడా ఆయన బేనర్ లోనే చేయబోతున్నానని తరుణ్ వెల్లడించాడు.