అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య వివాదం

0bhuma-akhila-priya-and-av-sనంద్యాల టిడిపిలో సంక్షోభం తలెత్తింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు , టిడిపి నాయకుడు ఏవీ సుబ్బారెడ్డికి మధ్య వివాదం తలెత్తింది. భూమా అఖిలప్రియ వ్యవహరశైలితో విసుగెత్తిన సుబ్బారెడ్డి పార్టీకి చెందిన కౌన్సిలర్లతో అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటుచేశారు.దీంతో కేంద్రమంత్రి సుజనాచౌదరి, జిల్లా ఇన్ చార్జీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఏవీసుబ్బారెడ్డిని హుటాహుటిని అమరావతికి రావాలని ఆదేశించారు.

భూమా నాగిరెడ్డి బతికున్న కాలంలో ఏవీసుబ్బారెడ్డి ఆయనకు కుడిభుజంగా వ్యవహరించారు. నంద్యాలలో పార్టీ కార్యక్రమాలను ఆయన కనుసన్నల్లో సాగేవి. వైసీపీలో ఉన్నా, టిడిపిలో చేరినా ఏవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోనే భూమా నాగిరెడ్డి నంద్యాలలో కార్యక్రమాలను కొనసాగించేవారు.

మంత్రిగా భూమా అఖిలప్రియ బాధ్యతలను చేపట్టిన తర్వాత కొంతకాలంపాటు ఏవీ సుబ్బారెడ్డికి, ఆమెకు మద్య సంబంధాలు బాగానే ఉన్నాయి.అయితే ఇటీవల కాలంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి అఖిలప్రియ వ్యవహరశైలి కారణంగానే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు ఆయన తన సన్నిహితుల ద్వారా చెప్పినట్టు ప్రచారంలో ఉంది.

ఈ తరుణంలోనే ఆయన నంద్యాలకు చెందిన టిడిపి కౌన్సిలర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తనతో ఉంటారా, మంత్రి అఖిలప్రియతో ఉంటారో తేల్చుకోవాలని ఆయన వారికి చెప్పడంతో పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.

ఏవీసుబ్బారెడ్డి వైఖరితో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించిన పార్టీ నాయకత్వం నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు చేపట్టింది. కేంద్రమంత్రి సుజానాచౌదరి,జిల్లా ఇన్ చార్జీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఏవీ సుబ్బారెడ్డికి ఫోన్ చేసి అమరావతికి రావాలని ఆదేశించారు. దీంతో ఆయన హుటాహుటిన అమరావతికి బయలుదేరి వెళ్ళారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మనందరెడ్డిని టిడిపి బరిలోకి దింపితే రాజకీయంగా తనకు మనుగడ ఉండదనే కారణంగా ఏవీ సుబ్బారెడ్డి వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో ఏవీ సుబ్బారెడ్డి మంచి సంబంధాలున్నాయి. ఒకవేళ ఏవీసుబ్బారెడ్డి పార్టీని వీడితే టిడిపికి నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. సుబ్బారెడ్డి నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి నుండి బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారనే ప్రచారం కూడ ఉంది.

ఉపఎన్నికల షెడ్యూల్ వెలువడే తరుణంలో ఏవీసుబ్బారెడ్డి తీసుకొనే నిర్ణయం పార్టికి నష్టం వాటిల్లకుండా ఉండాలని టిడిపి జాగ్రత్త పడుతోంది. అందుకే ఆయనను అమరావతికి పిలిపించారు.