అతి విశ్వాసమే వైసీపీ కొంపముంచుతోందా?

0Jagan-and-CBNస్వంత జిల్లాలో ప్రజల గురించి పట్టించుకొన్నా పట్టించుకోకపోయినా సెంటిమెంట్ కారణంగా ప్రజలు తమకు ఓటు చేస్తారనే అతి విశ్వాసం కారణంగానే వైసీపీ కడప జిల్లాలో పట్టును కోల్పోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరో వైపు టిడిపి ఈ జిల్లాలో తన పట్టును పెంచుకొనే ప్రయత్నాలను ప్రారంభించింది. రెండు పార్టీలు కూడ ఒకరిపై మరోకరు ఆధిపత్యాన్ని సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప జిల్లాలో వైఎస్ వివేకానందరెడ్డిపై టిడిపి విజయం సాధించింది.ఈ విజయం టిడిపి శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది.మరో వైపు ఈ జిల్లాలో టిడిపి విజయం సాధించడం వైసీపీకి ఊహించని షాకిచ్చింది.

కడప జిల్లాలో వైసీపీ కంచుకోటను దెబ్బకొట్టాలని టిడిపి ప్రయత్నాలను ప్రారంభించింది.2019 ఎన్నికల్లో ఈ జిల్లా నుండి వీలైనన్నీ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలని టిడిపి వ్యూహారచన చేస్తోంది.

అయితే వైసీపీ అతి విశ్వాసమే ఆ పార్టీ కొంపముంచుతోందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.వచ్చే ఎన్నికలనాటికి పరిస్థితుల్లో మార్పు చేసుకోకపోతే ఆ పార్టీ ఇంకా నష్టపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత కడప జిల్లా ప్రజల్లో మార్పులు వచ్చాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు వైఎస్ మరణించే నాటకి కడప జిల్లాలో వైఎస్ కుటుంబానిదే హావా కొనసాగింది.అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో వైఫల్యం చెందారని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.గత ఎన్నికల్లో కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం నుండి టిడిపి విజయం సాధించింది. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ గణనీయగానే ఓట్లను సాధించింది. మరో వైపు బద్వేల్, కమలాపురం నియోజకవర్గాల్లో కూడ వైసీపీ అభ్యర్థులు ఓటమి అంచు వరకు వెళ్ళారు.

రాయలసీమలో తమ పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాల్లో బలాన్ని పెంచుకొనేందుకుగాను టిడిపి ప్రయత్నాలను ప్రారంభించింది.ఈ మేరకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని టిడిపిలోకి ఆహ్వానించి మంత్రి పదవి ఇచ్చారు. బద్వేల్ ఎమ్మెల్యే కూడ టిడిపి తీర్థం పుచ్చుకొన్నారు.వైసీపీకి చెక్ పెట్టేందుకు అవసరమైన వ్యూహారచన చేస్తోంది టిడిపి. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది.ఈ జిల్లాలో బలమైన ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి టిడిపి ఆహ్వానించింది.అందివచ్చిన ప్రతి అవకాశాన్ని టిడిపి తమకు అనుకూలంగా ఉపయోగించుకొంటోంది.

ఎన్నికల సమయంలోనే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి జగన్ ప్రచారం నిర్వహిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.అయితే ఇతర సమయాల్లో జిల్లాలో పర్యటించినా పులివెందుల నియోజకవర్గానికి జగన్ పరిమితమౌతారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కారణం కూడ పార్టీకి కొంత నష్టాన్ని తెచ్చిపెడుతోందనే అభిప్రాయం కూడ లేకపోలేదు.వైసీపీ అభ్యర్థులను గెలిపించడంలో ముందుండే ప్రజల విషయంలో ఆ పార్టీ కొంత చొరవచూపితే ఆ పార్టీకే ప్రయోజనం దక్కే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

వైసీపీ ఇదే తీరును కొనసాగిస్తే రానున్న రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.అయితే కడప జిల్లాపై టిడిపి ఎక్కువ కేంద్రీకరిస్తోంది. జగన్ ను స్వంత జిల్లాలో దెబ్బకొట్లాలని ప్రయత్నాలు చేస్తోంది. మండలి వైస్ ఛైర్మెన్ సతీష్ రెడ్డి నీటిని సాధించేవరకు తాను గడ్డం తీయానని ప్రతినబూని కడప జిల్లాకు నీటిని తీసుకువచ్చాడు. ఈ తరహా ప్లాన్ తో టిడిపి ముందుకుసాగుతోంది. అయితే వైసీపీ మాత్రం టిడిపి వ్యూహాలకు ప్రతి వ్యూమాలను సిద్దం చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.లేకపోతే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు.