అంతుచిక్కని వ్యూహాల వెనుక అసలు కథ ఏంటో..?

0telangan-issueరాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఎత్తుగడలు, వ్యూహాలు ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న కాంగ్రెస్.. తనదైన రాజకీయాన్ని నడిపిస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన పార్టీలు కూడా ఆచితూచి స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ తంత్రాలు బాగా తెలిసిన కేసీఆర్ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటయ్యే వరకూ పోరాడాలన్న భావనలోనే ఉన్నారు. ఏమాత్రం ఆదమరచి ఉండకూడదని తమ మద్దతుదారులకు సూచిస్తున్నారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ క్లియర్ కట్ గా ప్రకటనలు చేసినా.. రాజకీయ వర్గాల్లో మాత్రం ముందునుంచీ ఏదో అనుమానం. తెలంగాణ బిల్లుపై పొంతనలేని ప్రకటనలు, సీమాంధ్ర నేతలను బుజ్జగించేందుకు ప్రత్యేక కమిటీల ఏర్పాట్లు ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. దీంతో ఇదంతా వ్యూహాత్మకం అయ్యుంటుందా..? కాంగ్రెస్ ఏం చేయబోతోందనే.. ఉత్సుకత ముందునుంచీ ఉన్నాయ్.

కాంగ్రెస్ ప్రకటనల నేపథ్యంలోనే.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బిల్లు ఆమోదం పొందే వరకూ ఆదమరచి ఉండకూడదని ముందునుంచీ అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న జేఏసీ కూడా ఇంచుమించు ఇదే మాట చెప్తోంది. కాంగ్రెస్ ప్రకటన తెలంగాణ ఏర్పాటులో కీలక మలుపు అని మాత్రం చెప్పింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడే.. విశ్వసించాలన్న తలంపులో వివిధ వర్గాలు ఉన్నాయి.

అనుకున్నది సాధించుకునేందుకు కాంగ్రెస్ ఎంతటికైనా తెగిస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం.. విభజన ప్రకటన చేసిందన్న మాట అందరికీ తెలిసిందే. ఈ ఎత్తుగడల్లో పడకూడదని కేసీఆర్ జాగ్రత్తపడుతున్నట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ ను వీలీనం చేస్తామన ప్రకటన ఇవ్వాలంటూ కాంగ్రెస్ నుంచి ఒత్తిళ్లు వచ్చినా.. అంచనాలు పెరిగినా కేసీఆర్ కూడా గుంభనంగా ఉండిపోవడం వెనుక కారణం కూడా ఇదేనేమో అనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ వ్యూహాన్ని మనోగతాన్ని చేస్తున్న ప్రకటనల్ని రాజకీయ వర్గాలు డీకోడ్ చేసే పనిలో పడ్డాయ్.

అటు టీడీపీ కూడా సంయమనంతో కాంగ్రెస్ ఎత్తుగడల్ని గమనిపిస్తూ ఆచితూచి మాట్లాడుతోంది టీడీపీ సీమాంధ్ర నేతలు రాజీనామాలు చేస్తున్నా కోస్తా రాయలసీమకి న్యాయం చేయాలని వాటాలు తేల్చాలని అంటున్నారు తప్ప అంతకు మించి తెలంగాణకి వ్యతిరేకమని గానీ అడ్డుకుంటామన్న ధోరణిలోగానీ మాట్లాడ్డం లేదు. ఇలాంటి పరిస్థితులన్నింటికీ కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహమే కారణం అనిపిస్తోంది. కాంగ్రెస్ ధోరణిని ఇంత క్లియర్ గా గమనించడానికీ.. బిల్లు ఆమోదం పొందేవరకూ విశ్రమించేది లేదని కేసీఆర్…తెగేసి చెప్పడానికీ చాలా కారణాలే ఉన్నాయ్. కొన్ని ప్రశ్నలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయ్.

అనేక సందేహాలు
కాంగ్రెస్ వ్యూహాలతో సర్వత్రా అనేక సందేహాలు నెలకొన్నాయ్. రెండు ప్రాంతాల నాయకులతో కాంగ్రెస్ ఉమ్మడిగా ఎందుకు మాట్లాడలేదు? ఓ ప్రాంతానికి సంబంధించి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే మరో చోట నిరసనలు వస్తాయని, విభజన జాప్యం చేయడంలో ఇదో కారణంగా ఉపయోగపడుతుందని భావించిందా? అసలు ఉద్యమానికి కారణమైన వాటాలు, నీటి కేటాయింపులు, రాజధానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేనేలేదు. అంటే కనీసం ఇలాంటి విషయాలు కూడా ఆలోచించకుండా బరిలో దిగేశారా? యుద్ధభూమిలో దిగిన తర్వాత వ్యూహం ఖరారుచేసునేంత తెలివితక్కువగా ఉంటుందా.. కాంగ్రెస్ సీమాంధ్ర నాయకులకి భారీగా పదవులిచ్చి… తెలంగాణ అనుకూల నిర్ణయం ఉంటుందని సంకేతాలిచ్చి రెండు మూడు నెలలవుతోంది. మరి… ఈ సమయంలో తెలంగాణ ఏర్పాటు చేశాక చేయాల్సిన పంపకాల మీద మాత్రం ఎందుకు దృష్టిపెట్టలేదు ? అనే ప్రశ్నలే ఇప్పుడు వినిపిస్తున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అనిశ్చితి, ముందస్తు అంచనాలు.. దాదాపు ఏడాది ముందే తెలిసిన పరిణామాలు. మరి అలాంటప్పుడు కూడా కచ్చితంగా ఎన్నికల ముందే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవుతుంది. ఏర్పాటు చేసి తీరుతాం.. అంటూ ప్రకటనలు చేయడంలో ఆంతర్యం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం దొరకడం లేదు… అందుకే కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయ్.. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న సమయంలో వ్యూహాత్మకంగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. ఏదో పంచిపెడుతున్నట్టుగా దశలవారీగా ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ కేలిక్యులేషన్స్ ఇపుడు పోటాపోటీ పోరాటాల్నే కాదు రాజకీయంగా అనుమానాల్ని రాజేస్తున్నాయ్.. ఉత్సుకత రేకెత్తిస్తున్నాయ్… చూడాలి కాంగ్రెస్ విసిరిన పాచిక ఎటుపడుతుందో.. ఏమవుతుందో !