కేసీఆర్ పిల్లలు సెలవులు లాక్కుంటావా?

0ఆశ్చర్యపోకండి!. నిజంగానే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగానే…పాఠశాల విద్యార్థులు “మావనహక్కుల కమిషన్“కు వెళ్లారు. కారణం తెలిస్తే..కచ్చితంగా షాక్ తింటారు. విద్యార్థుల సెలవులు తగ్గిపోవడం వల్ల వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల విద్యార్థులకు కాలేజీ విద్యార్థులు తోడవడం ఇందులో మరో ట్విస్ట్. రాష్ట్రావతరణ ఉత్సవాలను నిర్వహించేందుకు వీలుగా పాఠశాలలను ముందుగా ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో జూన్ 1వ తేదీ నుండి పాఠశాలలు – జూనియర్ కాలేజీలను ప్రారంభించాలని కేసీఆర్ ఖరారు చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంపై కొంత మంది విద్యార్థులు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.

జూన్ 2వ తేదీన రాష్ట్రావతరణ ఉత్సవాలలో విద్యార్థులను మమేకం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యార్థులకు సైతం తెలంగాణ ఆవిర్భావ పోరుపై సంపూర్ణ అవగాహన కలిగించడమే సదుద్ధేశంగా సిఎం ఈ సూచన చేశారని – దీనివల్ల తెలంగాణ భౌగోళిక – రాజకీయ – సాంస్కృతిక – సామాజిక అంశాలపై అవగాహన పెంచిన వారమవుతామని ఆయన భావించారు. అయితే దీనిపై విద్యార్థుల నుంచి నిరసన వ్యక్తమైంది. వేసవి సెలవులను పొడిగించాలని – రాష్ట్రావతరణ ఉత్సవాల పేరుతో పాఠశాలలను ముందుగా ప్రారంభించడం సరికాదని – వేసవి వడగాడ్పులు తగ్గలేదని – ఎండ చాలా తీవ్రంగా ఉంటోందని విద్యార్థులు – తల్లిదండ్రులు వాదించారు. ఇంత ఎండల్లో సగటున 40 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదు అవుతోందని – మరికొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు మించి నమోదవుతోందని విద్యార్ధులు వాపోతున్నారు. గత ఏడాది ఎండ తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం సెలవులు ఇచ్చిందని – ఈ ఏడాది కూడా సెలవులు జూన్ 12 వరకూ పొడిగించాలని విద్యార్థులు కోరుతున్నారు. రాష్ట్రావతరణ కార్యక్రమాన్ని నిర్వహించి దానిలో ఆసక్తి ఉన్న వారిని పాల్గొనమంటే సరిపోతుందని అందరినీ నిర్బంధం చేయడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రావతరణ కార్యక్రమానికే రాలేకపోతే ఎలా అని అధికారాలు చెబుతున్నారు. వీటన్నింటికీ విద్యార్థులు ఎండలు సాకుగా చూపుతుండగా వచ్చేవారంలో నైరుతిపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయని సహజంగానే వేడమి చల్లారుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయాన్ని ప్రకటించకపోవడం గమనార్హం.