నేటితో టెలిగ్రామ్‌కు సెలవు

0న్యూఢిల్లీ : భారతదేశంలో 163 సంవత్సరాలుగా సేవలందించిన టెలిగ్రాఫ్‌ సర్వీసులు నేడు నిలిచి పోనున్నాయి. ఈస్టిండియా కంపెనీ పాలనలో మొదటిసారిగా 1850లో బెంగాల్‌లో కలకత్తా-డైమండ్‌ హార్బర్‌ల మధ్య ఈ సర్వీసును ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అనంతరం 1854లో టెలిగ్రాం సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. క్రీ.శ.1857 సిపాయిల తిరుగు బాటును అణచివేయడంతో పాటు అనంతరం జరిగిన అనేక సంఘటనల్లో బ్రిటిషు పాలకులకు ఈ సేవలు ఎంతగానో ఉపకరించాయి. అనంతరం స్వతంత్ర భారతంలో ప్రజల జీవనంతో టెలిగ్రాం మమేకమైంది. అయితే కాలగమనంలో వచ్చిన ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌, మొబైల్‌.. తదితర సర్వీసులతో టెలిగ్రాంకు ఆదరణ తగ్గింది. దీంతో ఈ సర్వీసులను ఈ రోజునుంచి నిలిపి వేయాలని కేంద్రం నిర్ణయించింది. టెలిగ్రాం సర్వీసులకు ఆఖరిరోజు కావడంతో ఈ శాఖలో పని చేసిన పలువురు ఉద్యోగులు భావోద్వేగానికి గురయ్యారు. పలువురు ప్రజలు టెలిగ్రాం సర్వీసులు వినియోగించేందుకు టెలికాం కార్యాలయాలకు పెద్దఎత్తున వచ్చారు.