సీమ ఫ్యాక్షన్ – దారుణమైన వెండితెర అబద్దం

0

రాయలసీమలో జనాలకు రక్తపాతం అంటే ఇష్టం. అందులోనూ ముఖ్యంగా రెడ్డి వర్గానికి చెందిన వారు రోడ్ల మీద విచ్చలవిడిగా నరుక్కుంటారు. జాలి దయ ఉండవు. అసలు సీమలో పోలీసులే ఉండరు. జీతాలు తీసుకోవడానికి తప్ప ఎవరు ఎన్ని హత్యలు చేసినా అడిగే సాహసం చేయరు. ఇక్కడ రాజ్యమేలేది అరాచకమే. ఎవరిలోనూ మానవత్వం ఉండదు. ఇదీ తెలుగు సినిమా గత కొన్నేళ్లుగా సీమ సంస్కృతిని వెండితెరపై గొప్పగా ఆవిష్కరిస్తున్న తీరు. వసూళ్ల కోసం ఒక ప్రాంతాన్ని ఒక వర్గపు అస్థిత్వాన్ని అవమానించే విధంగా జరుగుతున్న ఈ పోకడ గత కొన్నేళ్లుగా నీరు పోసిన నిప్పులా చల్లబడి ఇక లేదు అనుకునేలా ఉంది. కానీ అరవింద సమేత వీర రాఘవతో ఒక్కసారిగా దీన్ని మళ్ళి వసూళ్ల కల్పతరువుగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ ఇది మొదలుపెట్టినవాడు కాదు ఆపేవాడు కాదు. కాకపోతే ఒక హిట్టు కోసం కనుమరుగైపోయిన సీమ ఫ్యాక్షన్ ని ఇంతలా చూపడమే ప్రశ్నగా మారింది. కొంత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. ప్రేమించుకుందాం రాలో జయప్రకాష్ రెడ్డి పాత్ర ద్వారా దీన్ని చూపించినప్పుడు దాని కన్నా ఎక్కువగా ప్రేమ కథ హై లైట్ కావడంతో ప్రేక్షకులు సరే ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు కదా అని లైట్ తీసుకున్నారు. సమరసింహారెడ్డి టైటిల్ తో సహా ఎప్పుడైతే ఒక వర్గంలో ఉన్న ముఠాల పోరుని వసూళ్ల గనిగా మార్చిన తరువాత అదే బి గోపాల్ నరసింహనాయుడుతో దాన్ని పీక్స్ లోకి తీసుకెళ్లిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ఆది దానికి ఊతమిస్తే చిరంజీవి ఇంద్ర దాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లింది. కక్షల కోసం కన్నబిడ్డల ప్రాణాలు తీయడం అందులోనే చూడొచ్చు. మహేష్ బాబు ఒక్కడులో ఓబుల్ రెడ్డిగా ప్రకాష్ రాజ్ ని మాములుగా చూపలేదు. ఇది అక్కడితో ఆగలేదు. అంతకు ముందు ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి – సాంబలో అన్ని ఇలాంటి హింసాత్మక నేపధ్యాలే తీసుకుని దాదాపు అన్నింటిని హిట్ చేసుకుని సీమ ఫ్యాక్షన్ తో కాసులు కురిపించుకున్నారు హీరోలు నిర్మాతలు.

నిజానికి ఇంత కన్నా హెచ్చు హింస సీమలో ఉండేదన్న మాట నిజం. కానీ అది ఏనాడో కొన్ని దశాబ్దాల క్రితం. ఇప్పటి తరానికి అది ఉందన్న సంగతి కూడా పెద్దగా అవగాహన లేదు. వర్గాలతో సంబంధం లేకుండా అందరు ఎడుక్యేట్ అయ్యారు. కానీ మహేష్ బాబు – జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు తమ కథల్లో సీమలో లేని హింసను చూపించినప్పుడు ఇప్పటి యువత నిజమే అనుకునే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. అరవింద సమేత వీర రాఘవలో మంచి సందేశం ఉండవచ్చు గాక. కానీ రక్తపాతాన్ని మితిమీరిన స్థాయిలో చూపించి చివర్లో ఇది తప్పు అని చెప్పినంత మాత్రాన సీమలో ఫ్యాక్షన్ లేదనే అభిప్రాయం అయితే రాదు కదా. అంతదాకా ఎందుకు లండన్ నుంచి చదువుకుని వచ్చిన రాఘవరెడ్డి అత్యంత దారుణంగా బసిరెడ్డి గొంతులో కత్తిని దింపినప్పుడు రక్తం ఎగజిమ్మే సీన్ తో మొదలుకుని చెట్టంత కొడుకుని బసిరెడ్డి దూలానికి వేలాడేసి చంపే దాకా వీటిని పాజిటివ్ గా తీసుకోవడం సాధ్యమేనా. అయినా కర్నూల్ కడప చిత్తూర్ అనంతపూర్ ఇలా సీమ జిల్లాలో ఎక్కడా నడిబజారులో హత్యలు చేసుకునే విచ్చలవిడితనం లేదు. ఆ మాటకొస్తే ఈ మధ్య పక్క రాష్ట్రాల్లో రోడ్ల మీద నరకడం చూసాం కానీ సీమలో మాత్రం కాదు.

ఇక్కడ దర్శక నిర్మాతలు ఎవరైనా సరే ప్రశ్నించుకోవాల్సింది ఒకటుంది. రెడ్డి లేదా నాయుడు లేదా చౌదరి వర్గం ఏదైనా కావొచ్చు. మనం పాత్రల ద్వారా వాళ్ళ స్వభావాన్ని తెరమీద హింస రూపంలో చూపిస్తున్నాం అంటే అది ఇంకోరకంగా అర్థం చేసుకునే మెచ్యూరిటీ అధిక శాతం సామాన్య ప్రేక్షకులకు ఉండదు. తాము చూస్తోంది నిజమే అనుకుంటారు. భక్తి సినిమాలు చూసాక దేవుడు ఉన్నాడు కదా అనే ఫీలింగ్ కలగడం ఎంత నిజమో ఇలాంటి హింసాత్మక చిత్రాలు చూసాక అవునా సీమలో ఇలా నరుక్కుంటారా అని ఇతర ప్రాంతాల వాళ్ళు అనుకోవడం కూడా అంతే సత్యం. పదేళ్ల నాడు ఫ్యాక్షన్ సినిమాలు రాజ్యమేలి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. మళ్ళి దీన్నొక హిట్ ఫార్ములా కిందకు తీసుకుని పదే పదే సీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఒక వర్గం కులం పేరుని పదే పదే చెప్పిస్తూ పోతే అది సామాజికంగా బలమైన ముద్ర వేసే అవకాశం ఉంది.

సినిమాలు చూసి జనాలు మారరు. నిజమే. కానీ ప్రభావితం అవుతారు. అందులో అనుమానం లేదు. కాబట్టి విచక్షణ అనేది ఉపయోగించి నప్పుడు ఒక ప్రాంతాన్ని వర్గాన్ని టార్గెట్ చేయడం వర్గాన్ని కించపరచడం ఉండదు. అసలు ప్రాంతాల వర్గాల పేర్లు అభూతకల్పనగా కొత్తవి చూపించినా పర్వాలేదు. కానీ వాస్తవికంగా వర్తమానంలో ఉన్నవి చూపించినప్పుడు మనోభావాలు దెబ్బతినవు. గాయపడతాయి. ఇది గుర్తిస్తే మంచిది.
Please Read Disclaimer