రాష్ట్రాలు వేరైనా జాతి సమైక్యంగా ఉండాలి : చంద్రబాబు

0హైదరాబాద్‌: ప్రజల మనోభావాలకు అనుగుణంగా 2008లో కేంద్రానికి లేఖ పంపామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. తమ నివాసం నుంచి ఈరోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ ఆయన చారిత్రక కారణాల వల్ల కేంద్రానికి కొన్ని డిమాండ్లు పెడుతున్నామని చెప్పారు. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు చాలా వ్యయమవుతుందని, ఇబ్బందులను తొలగించి బాధ, ఆవేదన లేకుండా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన అన్నారు. జల, విద్యుత్‌, ఆర్థిక వనరుల అభివృద్ధికి కృషిచేసేలా కార్యాచరణ ఉండాలన్నారు.

కొత్త రాజధానిలో కూడా హైదరాబాద్‌ లాగా అభివృద్ది చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. కొత్త రాజధాని ఏర్పాటుకు కనీసం రూ. 4,5 లక్షల కోట్లు ఖర్చవుతుందన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తామన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. కొత్త రాజధాని ఏర్పాటుకు నిధులు, భూములు పెట్టుబడులు అవసరమని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తెలుగు జాతి ప్రజల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు రేగకుండా నిర్ణయాలు చేయాలని సూచించారు.

రాష్ట్రాలు వేరైనా తెలుగుజాతి సమైక్యంగా ఉండాలనేదే తెదేపా అభిప్రాయమన్నారు. అనివార్య కారణాలతో రెండు రాష్ట్రాలు ఏర్పడినా ఇరుప్రాంతాల మధ్య ద్వేష భావాలు ఉండరాదని, తెలుగు జాతి ప్రజల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు రేగకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇరుప్రాంతాల సమస్యలకు పరిష్కారాలన్నింటినీ బిల్లులో పొందుపరచాలన్నారు. కొత్త రాజధానిపై స్పష్టమైన విధానం ఉండాలని, అవసరమైన నిధులు కేటాయించాలని ఆయన సూచించారు. ఉద్యోగాలు, సాగునీరు, రాజధాని విషయాల్లో యువతలో ఆందోళన ఉందని, గతంలో ఇచ్చిన లేఖకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించాలని చంద్రబాబు సూచించారు. సమస్య పరిష్కారానికి కేంద్రం, జాతీయ పార్టీలతో మాట్లాడతామన్నారు.

రాష్ట్రాలు వేరైనా జాతి సమైక్యంగా ఉండాలి : చంద్రబాబు, telugupeople should be unite, telugupeople should be unite says chandra babu naidu,