ప్రశాంత్ సర్వే: వైసీపీ నేతల్లో టెన్షన్?

0Jagan-and-prashant-kishorవైసిపి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలు ఆ పార్టీలో పలువురిని టెన్షన్‌కు గురి చేస్తున్నాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఆయా నేతలు, ఎమ్మెల్యేలపై అంతర్గత సర్వేలు చేస్తున్నారు.

అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోను సర్వే చేశారని తెలుస్తోంది. జిల్లా వైసిపి నేతల్లోను టెన్షన్ మొదలైందనే వాదనలు వినిపిస్తున్నాయి. పలు అంశాలు నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయట.

నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాలకు కొందరు నేతలు ఖర్చు చేస్తున్నారు. వీరిలో ఇప్పుడు సీట్ల భయం పట్టుకుందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ సర్వేలో పేరున్న వారికే టిక్కెట్లు ఖాయమని జగన్ చెప్పారని, దీంతో కలవరం ప్రారంభమైందని అంటున్నారు.

ప్రశాంత్ కిశోర్ నియమించిన ప్రత్యేక బృందం ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో రహస్య సర్వే చేపట్టిందని అంటున్నారు. ముగ్గురు సభ్యులతో కూడిన జట్టు నియోజకవర్గాల వారీగా కీలక నేతలతో సమావేశాలు నిర్వహించింది. నియోజకవర్గ సమన్వయకర్తలతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీసిందని సమాచారం. ప్రజలతో పాటు పలువురు చర్నలిస్టుల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేశారని సమాచారం.

ఈ సర్వేలో కొన్నిచోట్ల సమన్వయకర్తలను మార్చాలనే డిమాండ్ ముందుకు వచ్చిందని ప్రచారం సాగుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి స్థానంలో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావుకి జిల్లా బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బలోపేతానికి ఉపయోగకరంగా ఉంటుందని కొంతమంది చెప్పారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సర్వే కోసం ప్రశాంత్ కిషోర్ తయారు చేసిన ప్రశ్నావళి కూడా నేతలను ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు.గత ఎన్నికల్లో అభ్యర్ధుల ఓటమికి కారణాలు ఏమిటి? ఎలాంటి హామీలు ఇస్తే బాగుంటుంది? వంటి ప్రశ్నలతోపాటు నియోజకవర్గ స్థాయిలో క్యాడర్‌కు సమన్వయకర్తలతో ఉన్న ఇబ్బందులు ఏమిటి? సమన్వయకర్తను మార్చాల్సిన అవసరం ఉందా లేదా? వంటి వివరాలను సేకరించిందని తెలుస్తోంది.

శ్రీకాకుళం, ఆముదాలవలస, టెక్కలి, పాతపట్నం, పలాస నియోజకవర్గాల్లో పర్యటించి వివరాలు రాబట్టింది. ఆయా నియోజకవర్గాల్లో ఇంకా ఎవరైనా సమర్ధవంతమైన నేతలున్నారా అని ఆరా తీశారని తెలుస్తోంది. ప్రస్తుతమున్న సమన్వయకర్తలకు టిక్కెట్లు ఇస్తే టిడిపి అభ్యర్ధులను ఎదుర్కొని నిలవగలరా అనే అంశంపైనా దృష్టి సారించిందని అంటున్నారు.

రాజాం, పాలకొండ నియోజకవర్గాల్లో వైసిపకి ఎమ్మెల్యేలున్నారు. రాజాం ఎమ్మెల్యే పని తీరుపై అసంతృప్తి వ్యక్తమైనట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన స్థానంలో మాజీ మంత్రి కొండ్రు మురళికి టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఆముదాలవలసలో మాజీమంత్రి తమ్మినేని సీతారాంకు కూడా ప్రశాంత్ కిషోర్ టెన్షన్ పట్టుకుందని ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతికి టిక్కెట్టు ఇచ్చే ఆలోచన చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. సర్వేలో తమ్మినేనిపై వ్యతిరేకత వ్యక్తమైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టెక్కలి, పలాసల్లో విభేదాలు పార్టీని నష్టపరుస్తున్నాయని చెప్పారని తెలుస్తోంది. ఇలాంటి చోట్ల నాయకత్వాన్ని మార్చాలని ప్రశాంత్ కిషోర్.. జగన్‌కు సూచించారని అంటున్నారు.