తారక్ అన్న సూపర్ అంటున్న థమన్

0యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దసరా సీజన్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ ప్లాన్ చేసి చక చకా షూటింగ్ జరుపుతున్నారు. కానీ ఎన్టీఆర్ నాన్నగారైన నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణంతో నందమూరి అభిమానులు.. నందమూరి కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. ఈ అనూహ్య పరిణామంతో ఎన్టీఆర్ ఇప్పట్లో షూటింగ్ లో పాల్గొనడం కష్టమని దీంతో సినిమా వాయిదా పడుతుందని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం సినిమా రిలీజ్ తన కారణంగా వాయిదా పడకూడదని అతి తక్కువ సమయంలోనే షూటింగ్ లో తిరిగి జాయిన్ అయ్యాడు.

తనకు వ్యక్తిగతంగా ఎంతో నష్టం జరిగినా.. మనసులో బాధ ఉన్నా నిర్మాతలకు నష్టం కలగకూడదని ఎన్టీఆర్ వెంటనే షూటింగ్ లో జాయిన్ కావడం అందరి మనసులను కదిలిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇదే విషయంలో ఎన్టీఆర్ డెడికేషన్ చూసి పూర్తిగా ఇంప్రెస్ అయ్యాడు. షూటింగ్ లొకేషన్ లో ఉన్న ఎన్టీఆర్ ఫోటోను పోస్ట్ చేసి ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. “ప్రియమైన తారక్ అన్నా.. నీ డెడికేషన్ చూస్తుంటే నీపై నాకున్న గౌరవం మరింతగా పెరిగింది. మేమందరం నీతో ఉన్నాము. నీకు దేవుడు మరింతగా స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్న బ్యాక్ ఆన్ సెట్స్ #అరవింద సమేత వీర రాఘవ” అని ట్వీట్ చేశాడు.

థమన్ ట్వీట్ కు ఎన్టీఆర్ అభిమానుల నుండి భారీ ఎత్తున స్పందన లభించింది. తమ అభిమాన హీరో డెడికేషన్ ను చూస్తే సెల్యూట్ చేయాలనిపిస్తోందని.. తన కష్టాన్ని పక్కనబెట్టి మరీ నిర్మాతల బాగుకోసం ఆలోచించడం ఎన్టీఆర్ గొప్పతనాన్ని తెలుపుతోందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.