జగన్.. వైఎస్ నుంచి ఏం నేర్చుకోలేదా?

0jagan-is-doing-ap-politicsనంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పని అయిపోయినట్లుగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సత్తా చాటడం సందేహమే అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు.

జగన్‌కు వ్యతిరేకమైన మీడియా పక్కా వ్యూహం ప్రకారం వార్తాకథనాలు ప్రచురిస్తుండడం వల్ల కూడా దానికి ఎక్కువ ప్రాచుర్యం లభిస్తోంది. అయితే, నంద్యాల ఉప ఎన్నిక ద్వారా మరోసారి జగన్ లోపాలు బయటపడిన విషయం మాత్రం కాదనలేని విషయంంగా మారింది.

చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు నంద్యాల ఫలితాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు అర్థమవుతోంది. మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు నేత హర్షకుమార్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. వైసిపికి చిన్న సలహా అంటూ ఆయన జగన్‌‌ లోపాలను ఎత్తిచూపారు.

హర్షకుమార్ ఇలా అన్నారు…. “Ycp కి చిన్న సలహా: జగన్ మొదటి సారి bye electionలలో 30 సీట్లకు 28 గెలిచారు. టీడీపీ 3rd position. తర్వాత state విడిపోయిన తర్వాత కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని అందరూ ఊహించారు. చాలా తక్కువ మార్జిన్లో వైసీపీ ఓడిపోయింది.ఇప్పుడు bye electionలో చంద్రబాబు ప్రలోభాలకు ప్రజలు లొంగిపోయారు.దీనిని ఎలా ఎదుర్కొనాలి?”

“1995 -99. 4 సంవత్సరాల cbn పరిపాలనను వైస్సార్ ఎండగట్టి ఎంత పోరాటం చేసిన cbnనే నెగ్గారు.తర్వాత 1999-2004 లో వరకు మళ్ళీ వైస్సార్ తానే సర్వసం అయి cong పార్టీ ని ఒక యుద్ధానికి సన్నద్ధం చేశారు.సక్సెస్ అయ్యారు. పరిపాలన అంటే ఏమిటి అనేది చూపించారు.ప్రజలను అక్కున చేర్చుకున్నారు.1994-2004 వరకు వైస్సార్ ను స్టడీ చేయాలి వైసీపీ” అని హర్షకుమార్ అన్నారు.

“ఎత్తులకు పైఎత్తులు ప్రజలను జాగృతం చేయడం , సన్నద్ధులను చేయడం స్థానిక నాయకత్వాన్ని గుర్తించి అక్కడ లోకల్ సమస్యలపై పోరాటం చేయడం… వైసీపీ ఇవ్వన్నీ చేయాలి.జగన్ గారు పరిణితి చెందిన నాయకులులాగా కనపడాలి. ఆయనకు ఎంతో సబ్జెక్ట్ తెలుసు. దాన్ని ప్రెసెంట్ చేసేటప్పుడు ప్రజల గుండెలలోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి.ఇది నాకు చెప్పాలనిపించింది.ఎందుకంటే టీడీపీ గెలుపు చూడలేని వ్యక్తులతో నేను ముందు ఉంటాను కాబట్టి.ఏమైనా ఎక్కువ మాట్లాడితే క్షంతవ్యుడ్ని” అని అన్నారు.

వైఎస్ రాజశేఖర రెడ్డికి సలహాదారుగా కెవిపి రామచంద్రరావు ఉండేవారు. కానీ, జగన్‌కు అలాంటి సలహాదారుడు ఉన్నట్లు కనిపించడం లేదు. మనసుకు తోచింది చేయడం కన్నా, తాను అనుకున్నదాన్ని తనకు సన్నిహితులైన వారితో పంచుకుంటే, దానిలోని మంచీచెడులు, లోటుపాట్లు తెలుస్తాయి. కార్యాచరణకు పదును పెట్టుకోవడానికి వలు కలుగుతుంది. ఈ విషయాన్ని హర్షకుమార్ చెప్పలేదు గానీ పరిణతి చెందిన నాయకుడిగా వ్యవహరించాలని అనడంలో అది కూడా ఉందని అనుకోవాల్సి ఉంటుంది. ప్రశాంత్ కిశోర్ ఆ లోటును తీరుస్తారా అంటే సందేహమే.