తోటపల్లి ప్రాజెక్టు జాతికి అంకితం

0thotapallyరికార్డు సమయంలో పట్టిసీమను పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తిచేసింది. విజయనగరం-శ్రీకాకుళం వాసుల దశాబ్దాల కళ నెరవేరబోతోంది. ఎన్నో ఉద్యమాలు పోరాటాల అనంతరం తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకుంది. దశాబ్ద కాలంగా ఆటుపోట్లు ఎదుర్కున్న తోటపల్లి ప్రాజెక్టును రేపు(గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతికి అంకితం ఇవ్వనున్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుకు చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో అనధికాలంలోనే పనులు పూర్తి అయ్యాయి.

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లక్షా 20వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు తోటపల్లి ప్రాజెక్టు సిద్ధమైంది. 2.5 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాగావళి నదిపై తోటపల్లి బ్యారేజ్‌కు 2003లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడే శంకుస్థాపన చేశారు. రూ.450 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ప్రారంభించారు. కానీ అనంతరం జరిగిన పరిణామాలతో ప్రాజెక్టు నిర్మాణం మందగించిపోయింది. జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రకటించినా నిధుల కేటాయింపులో మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలోనూ అలసత్వం కారణంగా ప్రాజెక్టు నిర్మాణం ఓ దశలో ప్రశ్నార్థకమైంది.

నిర్వాసితులు పోరుబాట పట్టడంతో పలుమార్లు లాఠీచార్జిలో చేయాల్సి వచ్చింది. ఆలస్యమవుతూ రావడంతో ప్రాజెక్టు వ్యవయం రూ.774 కోట్లకు చేరుకుంది. అప్పట్లో జిల్లా మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ కమీషన్లరూపంలో రూ.కోట్లు మింగేశారన్న ఆరోపణలు వచ్చాయి. తిరిగి అధికారం చేపట్టిన చంద్రబాబు ఏకకాలంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.160 కోట్లు కేటాయించారు. దీంతో పెండింగ్ పనులు మొత్తం యుద్ధ ప్రాతిపదికన పూర్తి అయ్యాయి. అయితే కొన్ని పిల్ల కాలువలను ఇంకా నిర్మించాల్సి ఉంది. ఆ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంతో పాటు పలు గ్రామాల రైతులు ఎత్తిపోతల పథకం ద్వారా తమ భూములకు కూడా నీరు ఇవ్వాలని కోరుతున్నారు. అటువైపు కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.