టాలీవుడ్ దసరా ఫైట్.. ఫిక్స్!

0ఏటేటా దసరా పండక్కి సినిమాల మధ్య రసవత్తరమైన పోటీ కనిపిస్తూ ఉంటుంది. పది రోజుల వరకూ సెలవలు.. ముందో వెనుకో వీకెండ్ కలిసొస్తే.. మరో రెండు రోజుల హాలిడేస్. అందుకే ఆ సీజన్ పై మేకర్స్ కు అంత మక్కువ. వీకెండ్ లోనే కాదు.. మొత్తం పది రోజులు వసూళ్లు దండుకోవచ్చు. అయితే.. ఈ దసరాకు ఎవరెవరు వస్తున్నారో అనే ఆసక్తి సహజం.

ఈ ఏడాది సెకండాఫ్ లో ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత మినహాయిస్తే.. మరో భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ లేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాను దసరా విడుదల కోసమే చకచకా పూర్తి చేసేస్తున్నారు. సహజంగా మాటల మాంత్రికుడి సినిమాలు లేట్ అవుతుంటాయ్ కానీ.. ఎన్టీఆర్ అరవింద సమేత మాత్రం పక్కాగా వచ్చేస్తుందట. నాగార్జున- నాని కలిస నటిస్తుండగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ కూడా దసరాకే వస్తుందని అంటున్నారు. తన షూటింగ్ పార్ట్ జూన్ చివరకే అయిపోతుందని నాగ్ చెప్పేశారు.

శ్రీను వైట్ల ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న రవితేజ మూవీ అమర్-అక్బర్-ఆంటోనీ. ఈ సినిమాకు ప్రస్తుతం హైద్రాబాద్ లో షెడ్యూల్స్ నిర్వహిస్తున్నారు. అమెరికాలో లాంగ్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు. ఇవి కూడా పూర్తి చేసి.. దసరాకు సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అంటున్నారు. రామ్ హీరోగా త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రాన్ని కూడా దసరాకే బరిలో దింపాలని నిర్మాత దిల్ రాజు ఫిక్స్ అయ్యారట.

ఇక శర్వానంద్ -సాయి పల్లవి జోడీగా నటించిన ముూవీ పడిపడి లేచె మనసు కూడా దసరాకే వస్తోందని అంటున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. ఇన్ని సినిమాలను ఎంగేజ్ చేయగల సత్తా దసరా సీజన్ కు ఉందంటున్నారు ట్రేడ్ జనాలు. కాకపోతే.. రిలీజ్ విషయంలో ముందు వెనుకలతో సరైన అవగాహనతో కూడిన ప్లానింగ్ మేకర్స్ కు ఉంటే చాలని చెబుతున్నారు. వారి పోటీ సంగతేమో కానీ.. పలు విభిన్నమైన సబ్జెక్టులతో ఈ సారి దసరా సినిమా హంగామా బాగానే అలరించనుంది.