జియో ఆఫర్ పై అంబానీ స్పష్టత

0Jio-Offersజియో ఉచిత ఆఫర్లను మార్చి 31 వరకు పొడిగించడంపై ఇతర టెలీకాం సంస్థలు టెలీకా రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌)కి ఫిర్యాదు చేయగా.. తాజాగా ట్రాయ్ ఈ విషయంలో అటార్నీ జనరల్ సాయం కోరింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం జియో ఉచిత ఆఫర్‌ను 90 రోజుల గడువు తర్వాత పొడిగించడం ఎలా కుదురుతుందని టెలీకా సంస్థలు నియంత్రణ మండలిని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయంలో ఎయిర్‌టెల్ ట్రాయ్‌‌కు వ్యతిరేకంగా టెలీకాం వివాదాలను పరిష్కరించే ట్రైబున్యల్‌ను కూడా ఆశ్రయించింది. ఈ వివాదాల నేపథ్యంలో జియో ఆఫర్‌‌ను పొడిగించిన అంశాన్ని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ దృష్టికి తీసుకొచ్చిన ట్రాయ్.. ఈ విషయంలో ఆయన అభిప్రాయం కోరింది.

సెప్టెంబర్ 5న జియో సేవలు లాంఛనంగా ప్రారంభం కాగా.. వెల్‌కమ్ ఆఫర్ పేరిట డిసెంబర్ చివరి వరకూ ఉచిత వాయిస్ కాల్స్, డేటా సేవలను అందించనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. వాస్తవానికి 90 రోజుల గడువు డిసెంబర్ 3తో ముగిసింది. అయినప్పటికీ.. డిసెంబర్ చివర్లో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను ప్రకటించిన జియో.. మార్చి చివరి వరకూ ఉచిత కాల్స్, డేటా‌ను అందిస్తోంది. ఈ విషయమై ట్రాయ్ ఇప్పటికే జియోను వివరణ కోరింది.

ఉచిత ఆఫర్ల విషయమై స్పందించిన జియో.. తాము నిబంధనలను ఉల్లంఘించలేదని లిఖిత పూర్వకంగా బదులిచ్చింది. వెల్‌కమ్‌ ఆఫర్‌కు, హ్యాపీ న్యూఇయర్‌ ఆఫర్‌కు సంబంధం లేదని స్పష్టం చేసింది. 90 రోజుల ఉచిత సేవల నిబంధనను తాము ఉల్లంఘించలేదని చెప్పుకొచ్చింది. సెప్టెంబర్ 5న ప్రకటించిన ఆఫర్‌లో రోజుక 4 జీబీ డేటాను ఉచితంగా అందించానమని, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్లో రోజులో 1 జీబీ డేటాను మాత్రమే ఉచితంగా అందిస్తున్నామని తెలిపింది. తొలుత అందించిన వెల్‌కమ్ ఆఫర్లో రోజులో 4 జీబీ డేటాను వాడిన వారు తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకోవడానికి గానీ రీచార్జ్ చేసుకోవడానికి గానీ అవకాశం లేదని.. ప్రస్తుత ఆఫర్ ప్రకారం 1 జీబీకి మించి డేటాను ఉపయోగిస్తే.. రీచార్జ్ చేసుకునే అవకాశం కల్పించామని బదులిచ్చింది.