మాటల ఇంద్రజాలికుడి మాయాజాలం!

0

సాధారణంగా హీరోలకు అశేష సంఖ్యలో అభిమానులు ఉండటం సహజం. కానీ ఒక దర్శకుడి మాటలకు ఫ్యాన్స్ ఉండటమే ఆశ్చర్యం. తన సినిమాల సభలలో తప్ప పెద్దగా బయట ఎక్కడా కనిపించని వినిపించని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫాలోయింగ్ చిన్నది కాదు. జయాపజలతో సంబంధం లేకుండా తన మాటలను పదే పదే గుర్తు చేసుకునేలా మనసు కలతగా ఉన్నప్పుడు సినిమాల రూపంలో ఆహ్లాదాన్ని పొందడానికి ఇప్పటి తరం ఆశ్రయిస్తున్నది ఈయన సినిమాలనే. అందుకే నవంబర్ 7 వాళ్ళకో స్పెషల్ డేట్ గా మిగిలిపోయింది. ఎందుకంటే ఆయన పుట్టిన రోజు కాబట్టి.

దర్శకుడుగా మారక ముందే తన మాటల మాయాజాలంతో త్రివిక్రమ్ కట్టిపడేసేవారు. ముఖ్యంగా విజయ్ భాస్కర్ కాంబోలో ఆయన కలంలో ప్రాణం పోసుకున్న స్వయంవరం-చిరునవ్వుతో సినిమాలు హీరో వేణుకి పెద్ద లైఫ్ ఇచ్చాయి – కెరీర్ ప్రారంభంలో రాసిన నువ్వే కావాలి రికార్డుల గురించి ఇవాళ్టికి మాట్లాడుకుంటూనే ఉంటారు. నువ్వు నాకు నచ్చావ్-మల్లీశ్వరిలు ఎవర్ గ్రీన్ ఎంటర్ టైనర్స్ గా నిలిచిపోయాయి. ఇక నువ్వే నువ్వేతో తన కలంతో పాటు కలలను కూడా తనలో దర్శకుడి ద్వారా ఆవిష్కరించడం మొదలుపెట్టిన త్రివిక్రమ్ ఆడపిల్ల తండ్రి మానసిక సంఘర్షణను ఆవిష్కరించిన తీరు ప్రశంశలతో పాటు వసూళ్ళను కూడా రాబట్టింది.

చిన్న పదాలతో లోతైన మీనింగ్ తో త్రివిక్రమ్ చేసే మేజిక్ ని ఎందరో అనుకరించే ప్రయత్నం చేసినప్పటికీ అందులో సక్సెస్ అయినవాళ్ళు చాలా తక్కువ. వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల్లో త్రివిక్రమ్ డైలాగ్స్ ని రిఫరెన్స్ గా తీసుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఖలేజా లాంటి ఫ్లాప్ సినిమా సైతం తర్వాత టీవీ ప్రసారం జరిగాక క్లాసిక్ గా గుర్తింపబడటాన్ని ఇక్కడ మర్చిపోకూడదు. అతడు కొన్ని వేల సార్లు టీవీలలో వచ్చినా ఇప్పటికీ రేటింగ్స్ వస్తూనే ఉన్నాయి. విడుదలకు ముందే అత్తారింటికి దారేది లీకైనా రికార్డుల వర్షాన్ని ఆపలేకపోయింది.

అజ్ఞాతవాసి లాంటి చేదు గుళికలు మధ్యలో వచ్చినప్పటికీ తక్కువ సమయంలోనే అరవింద సమేత వీర రాఘవతో దాన్ని అధిగమించడం ఆయనకే చెల్లింది. హీరోలు ఎప్పుడు మాతో ఈ దర్శకుడు చేస్తాడా అని ఎదురు చూసే స్థాయి ఆయనది అంటే ఆ మాటల మహత్యం పదాల్లో వర్ణించేది కాదు. అందుకే ఆయన పుట్టిన రోజు సినిమా ప్రేమికులకు సైతం పండగ రోజులా భావించేలా చేసింది
Please Read Disclaimer