కెసిఆర్‌కు చిక్కులు: భూస్కాంతో NT సిఈవోకు లింక్?

0kcr-damodar-rao-miyapur-landమియాపూర్ భూ కుంభకోణంలో తీగ లాగితే డొంక కదులుతోంది. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే నమస్తే తెలంగాణ దినపత్రిక సిఈవో దీపకొండ దామోదర్ రావు పాత్రపై వార్తకథనాలు వచ్చాయి.

భూ కుంభకోణంలో కేంద్ర బిందువుగా భావిస్తున్న ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్‌తో ఆయనకు సంబంధాలున్నట్లు మన తెలంగాణ దినపత్రిక రాసింది. ఆ సంస్థ కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన కారును దామోదరరావుకు ఇచ్చినట్లు, ఆయన దాన్ని తన సొంత కారు మాదిరిగా వాడుకుంటున్నట్లు ఆ పత్రిక రాసింది.

మన తెలంగాణ దినపత్రిక కథనం ప్రకారం – తెలంగాణ పౌర సమాజం ‘కారు కథ’ను తేల్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి వేదిక ‘ట్రూ కాలర్’ ఫోన్ నెంబర్ గుట్టు విప్పింది. మియాపూర్ భూ కుంభకోణంలో పాత్రధారి ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్ పేరుతో ఉన్న లగ్జరీ బెంజి కారు (TS 10EH 6666), రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉన్న ఫోన్ నెంబర్ 8096677777 ఆచూకీ దొరికింది. ఈ రెండు కూడా ఒకే వ్యక్తి పేరు వద్ద నిలిచాయి.

ఆ వ్యక్తి దామో దర్‌రావు దీవకొండ అని ఆ పత్రిక రాసింది. ఆయన అధికార పార్టీకి చెందిన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ప్రింటర్, పబ్లిషర్. వృత్తిరీత్యా ఆడిటర్. ఆయనది కరీంనగర్ జిల్లా. అనేక కంపెనీలకు డైరెక్టర్ హోదాలో ఉన్నారు. ఇంకా ఆ పత్రిక ఇలా రాసింది – తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తరువాత పలు కంపెనీలను ఆయన రిజిష్టర్ చేశారు. ఆయన ఇంటి చిరునామాతో మరికొన్ని కంపెనీలు కొత్తగా ఏర్పాటయ్యాయి.

దామోదర రావు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు అత్యంత సన్నిహితుడు. కెసిఆర్ అధికార నివాసం ప్రగతి భవన్‌లోకి ఆయనకు అన్ని వేళల్లో అనుమతి ఉంటుంది. ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్ కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన కారను దామోదర్ రావుకు అందుబాటులో పెట్టడం అనుమానాలకు తావిస్తోందని మన తెలంగాణ దినపత్రిక వ్యాఖ్యానించింది.

మియాపూర్ భూ కుంభకోణానికి సంబంధించిన పలు అంశాలను పౌర సమాజం పత్రిక దృష్టికి తీసుకుని వస్తోందని, వాటి విశ్వసనీయతను పరిశీలిస్తున్నామని కూడా మన తెలంగాణ దినపత్రిక రాసింది. దామోదర్ రావుకు ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్‌తో సంబంధాలున్నాయనే సమాచారం అందినప్పటికీ అది ధృవపడాల్సి ఉందనే పద్ధతిలో ఆ పత్రిక రాసింది. ఇదీ కారు కథ అనే శీర్షిక కింద ఆ వార్తను రాసింది.

మియాపూర్ భూకుంభకోణానికి సంబంధించి మన తెలంగాణ అంతకు ముందు కారు కథ అంటూ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. మియాపూర్ భూకుంభకోణం పాత్రధారి అయిన ఇన్‌ఫ్రా వెచర్స్ ఆ కారును 2016లో కొనుగోలుచేసినట్లు రాసింది. ఆ వార్తాకథనం ప్రకారం – కేసులో అరెస్టయిన పి. పార్థసారథి ట్రినిటీ తరఫున ఆ కారును కొనుగోలుచేశారు.ఎస్350డిఎల్ నెంబర్ గల ఆ మెర్సిడెజ్ బెంచ్ కారును రిజిస్ట్రేషన్ చార్జీలతో కలిపి కోటీ 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు.

ఆ కారును కొనుగోలు చేసిన సమయంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో ట్రినిటీ నెంబర్ ఇవ్వకుండా వేరే వ్యక్తి పేరు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందని మన తెలంగాణ పత్రిక రాసింది. ఆ కారును వాడుతున్న వ్యక్తికీ ట్రినిటీకీ ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించింది. అంత ఖరీదైన కారను కొన్న ట్రినిటీ సంస్థ వేరే వ్యక్తికి ఆ కారును ఎందుకిచ్చిందని, దానిలోని గుట్టు ఏమిటని అడిగింది. ఈ ప్రశ్నలకు భూకుంభకోణానికి మధ్య ఉన్న సంబంధమేమిటని కూడా మన తెలంగాణ వార్తాకథనంలో అడిగింది.

తాజా కారు కథ కారణంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. దామోదర్ రావు కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. నేరుగా ఆ వార్తాకథనం కెసిఆర్‌ను టార్గెట్ చేసిందని కూడా అనుకోవచ్చు. ఇప్పటి వరకు బయటపడిన వ్యవహారాలేవీ ఇంత నేరుగా కెసిఆర్‌ను టార్గెట్ చేసిన దాఖలు లేవు. దామోదర్ రావుతో కెసిఆర్‌కు ఉన్న సంబంధాలే దానికి కారణం.