ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు

0naini-narashimha-reddyహైదరాబాద్ ‌: ఇంటికో ఉద్యోగం ఇస్తామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయిని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. తాము ఇచ్చిన మాటప్రకారం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని విజయపథంలో నడిపిస్తున్నారన్నారు.

మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు చరిత్రలో మైలురాయిగా నిలుస్తాయన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. అంతకుముందు నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మేయర్‌ దంపతులు బొంతు రామ్మోహన్, శ్రీదేవి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సామ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.