ఇప్పటిదాకా ప్రభుత్వం.. అభివృద్ధిపైనే దృష్టి

0kcr-party-officesతెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చే ఎన్నికల కోసం పార్టీని పూర్తిస్థాయిలో పటిష్ఠం చేసే కసరత్తు ముమ్మరం చేశారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి వంద రోజుల కార్యాచరణ సిద్ధంచేశారు. జిల్లా స్థాయి, లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం ద్వారా పార్టీ ఎంపీలు, శాసనసభ్యులు, ముఖ్యనేతలతో భేటీ కావాలనీ ఆయన నిర్ణయించారు.

ప్రస్తుతం తెరాస అధికారంలో ఉన్నా.. రికార్డు స్థాయిలో దాదాపు 75 లక్షల సభ్యత్వ నమోదు జరిగినప్పటికీ గ్రామ స్థాయిలో పార్టీ బలంగా లేదు. ఎమ్మెల్యేలకు ఆసక్తి లేకపోవడం, పార్టీ వర్గాలతో సమన్వయం కుదరకపోవడం వంటి కారణాలతో గ్రామ, మండల స్థాయి కమిటీలూ ఏర్పాటు కాలేదు. జిల్లా కమిటీల స్థానంలో నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించినా అదీ కార్యచరణకు నోచుకోలేదు. ఎమ్మెల్యేలున్న చోట నియోజకవర్గ కమిటీలు లేవు. పార్టీ ఎమ్మెల్యేలు లేని 39 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జీలూ లేరు. పార్టీ ఎంపీలు లేని సికింద్రాబాద్‌, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లో బాధ్యుల నియామకమూ ఎటూ తేలడం లేదు. దీంతో ఆయా శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల్లో బాధ్యులెవరనే అంశంపై పార్టీ శ్రేణుల్లో సందిగ్ధం నెలకొంది.

నియోజకవర్గ ఇన్‌ఛార్జీల నియామకంతో మొదలు: ఇందులో భాగంగా పార్టీ నేతలతో ఇటీవల సమావేశమై కార్యాచరణ ఖరారు చేశారు. దీని ప్రకారం ఈ నెలలోనే తొలుత అన్ని నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటిస్తారు. మార్చిలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే అన్ని శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై సూక్ష్మస్థాయి పరిశీలనకు శ్రీకారం చుడతారు. ఆయా నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలతో సమావేశాలు నిర్వహిస్తారు. వీటికి ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలను ఆహ్వానిస్తారు. వంద రోజులపాటు కొనసాగే ఈ క్రతువు ద్వారా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో విజయానికి అవసరమైన వ్యూహాలను ఖరారు చేస్తారు.

లోటుపాట్లు సరిదిద్దే దిశగా: పార్టీ రాష్ట్ర కమిటీ పనితీరుపై అధినేత కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. చాలా మంది ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు వారికి నిర్దేశించిన విధులు సరిగా నిర్వర్తించడం లేదని ఆయన భావిస్తున్నారు. ఎంపీలతో సమన్వయ లోపం కారణంగా స్థానిక ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలకు వెళ్లడం లేదని, ఇన్‌ఛార్జీలు ఎవరో తేలనందున స్థానిక పార్టీ శ్రేణులు రాష్ట్ర కమిటీ నేతలను పట్టించుకోవడం లేదని అంచనాకు వచ్చారు. ఈ పరిస్థితిని సరిదిద్దాలని సీఎం భావిస్తున్నారు. బూత్‌స్థాయి నుంచి మండల, నియోజకవర్గ కమిటీలను పూర్తిస్థాయిలో నియమించి, 2019లో జరగబోయే ఎన్నికల సన్నద్ధతపై వాటికి దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు.

భూమి కొని కార్యాలయాల నిర్మాణం: పార్టీ శాశ్వత ప్రయోజనాల కోసం అన్ని జిల్లాల్లోనూ తెరాస సొంత కార్యాలయ భవనాలను నిర్మించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. దీనికీ ఏప్రిల్‌ నుంచే శ్రీకారం చుడతారు. ఇప్పటికే ఖమ్మంలో పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం జరిగింది. అదే నమూనాలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు అన్ని కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడమో లేదా ఆయా జిల్లాలకు వెళ్లినప్పుడు ఈ క్రతువు చేపట్టడమో చేయాలని భావిస్తున్నారు. పార్టీ భవనాల కోసం సొంతంగా భూమిని కొనుగోలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయానికొచ్చారు.

ఇప్పటిదాకా ప్రభుత్వం.. అభివృద్ధిపైనే దృష్టి

అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడున్నరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించారు. సభ్యత్వ నమోదు, ప్లీనరీల సందర్భాల్లోనే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. శాసనసభ, పార్లమెంటు సమావేశాల సమయాల్లోనే ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. ఇటీవల పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించిన ఆయన.. ఇందులో భాగంగా 3 నెలల క్రితం పార్టీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. మరో 15 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇకపై పార్టీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్న నిర్ణయానికొచ్చారు.

తెరాసలోకి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి!

మాజీ ఎమ్మెల్యే, భాజపా నాయకుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. దీనిపై సోమవారం ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ప్రతాప్‌రెడ్డి 2004లో తెరాస తరఫున చేర్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 ఉప ఎన్నికలోనూ విజయం సాధించారు. 2009లో ఓడిపోయారు. తర్వాత భాజపాలో చేరారు.