ట్రంప్‌నకు అధ్యక్షుడు కావాలన్న ఉద్దేశమే లేదట!

0Donald-trumpడొనాల్డ్‌ ట్రంప్‌నకు అమెరికా అధ్యక్షుడు కావాలన్న ఉద్దేశమే లేదట! ఎన్నికల్లో ఆయన విజయం సంగతి తెలిసి, ఆయన భార్య మెలానియా.. కన్నీటి పర్యంతమయ్యారట. కానీ అవి ఆనందబాష్పాలు కావట. అమెరికాకు చెందిన విలేఖరి మైఖేల్‌ వుల్ఫ్‌ తన పుస్తకం ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ: ఇన్‌సైడ్‌ ద ట్రంప్‌ వైట్‌హౌస్‌’లో ఇలాంటి ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పుస్తకంలోని అంశాలివీ..

ట్రంప్‌ అంతిమ లక్ష్యం.. గెలుపు సాధించాలన్నది కాదు. ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ వ్యక్తి కావాలన్నది ఆయన ఉద్దేశం. అధ్యక్ష రేసు ఆరంభంలోనే ఈ విషయాన్ని ఆయన తన సహాయకుడు శామ్‌ నన్‌బర్గ్‌కు చెప్పారు. టీవీ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకుంటే తొలుత అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ట్రంప్‌ స్నేహితుడు, ‘ఫాక్స్‌ న్యూస్‌’ మాజీ అధిపతి రోజర్‌ ఏయిల్స్‌ ఆయనకు సూచించేవారు. వైట్‌హౌస్‌లోకి వచ్చాక.. పాలన, విధాన నిబంధనలను సమూలంగా మార్చేయాలని ట్రంప్‌ భావించారు. అయితే తన సిద్ధాంతాలు, విమర్శలను విధానాలుగా ఎలా మార్చాలన్నదానిపై ఆయనకు చాలా పరిమితంగానే ఆలోచనలు ఉన్నాయి. సమాచార మదింపు సరిగా చేసేవారు కాదు. చదవరు. ఆయనను అరకొర అక్షరాస్యుడిగా కొందరు అభివర్ణిస్తుంటారు. ఎంత నాసిరకంగా, అసంబద్ధంగా ఉన్నప్పటికీ తన సొంత నైపుణ్యంపైనే ఆయనకు నమ్మకం ఎక్కువ.

ఫలితాల రోజు..

ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు రాత్రి 8 గంటల సమయంలో.. ట్రంప్‌ గెలుపు సాధించబోతున్నారని స్పష్టమైంది. ఆ సమయంలో మెలానియాను చూసి దెయ్యాన్ని చూసినట్లుగా అదిరిపోయానని ట్రంప్‌ కుమారుడు డాన్‌ జూనియర్‌ తన స్నేహితుడితో చెప్పాడు. ఆమె కన్నీటి పర్యంతమయ్యారని, అయితే అవి ఆనందబాష్పాలు కావని పేర్కొన్నారు. నాడు గంట సమయంలోనే ట్రంప్‌ ముఖ కవళికలు మారిపోయాయని రచయిత పేర్కొన్నారు. తొలుత అయోమయంలో ఉన్న ట్రంప్‌.. ఆ తర్వాత అపనమ్మకంలో ఉన్న ‌ట్రంప్‌… ఆనక బిత్తరపోయిన ట్రంప్‌ ఆవిష్కృతమయ్యారు. అంతలోనే ఆయన.. అమెరికా అధ్యక్ష పదవికి అర్హుడైన, ఆ సామర్థ్యం కలిగిన వ్యక్తిగా తనను తాను భావిస్తున్నట్లుగా ఫోజులిచ్చారు. అధికారం చేపట్టిన మొదటి కొద్దినెలల్లో ట్రంప్‌, ఆయన సలహాదారులు తీసుకున్న నిర్ణయాలు గందరగోళానికి దారితీశాయి. అది ఏడాది మొత్తం కొనసాగింది.

మారిన తీరు..

హెచ్‌-1బీ సహా సిలికాన్‌ వేలీకి సంబంధించిన సమస్యలపై ట్రంప్‌ తొలుత సానుభూతితో ఉండేవారు. అధికారం చేపట్టాక హెచ్‌-1బీ అంశంపై ఆయన తీసుకున్న కఠిన వైఖరి.. మునుపటి దృక్పథానికి భిన్నంగా ఉంది. ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు 2016 డిసెంబర్‌ 14న సిలికాన్‌ వేలీ అగ్రనాయకులు ఆయనతో భేటీ అయ్యారు. ఐటీ పరిశ్రమకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని, దానిపై మితిమీరిన నియంత్రణ ఉందని ఆయన ఆ తర్వాత.. మీడియా దిగ్గజం రూపర్ట్‌ మర్డోక్‌తో ఫోన్‌లో చెప్పారు. వారికి నిజంగానే హెచ్‌-1బీ వీసాలు అవసరమన్నారు. వారికి సహాయం చేయడానికి ఇది తనకు అవకాశమన్నారు. అయితే హెచ్‌-1బీపై సరళ వైఖరిని అనుసరించడం.. గోడను నిర్మించి, సరిహద్దులను మూసేస్తాన్న తన ఎన్నికల హామీకి విరుద్ధంగా ఉంటుందని మర్డోక్‌ పేర్కొన్నారు. దీనికి ట్రంప్‌ బదులిస్తూ.. ‘‘దాన్ని మేం పరిష్కరిస్తాం’’ అని చెప్పారు.

ఈ పుస్తకంలోని అంశాలను వైట్‌హౌస్‌ కొట్టిపడేసింది. అదంతా కాల్పనిక సాహిత్యమని వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి శారా శాండర్స్‌ తెలిపారు. ‘‘వైట్‌హౌస్‌లోకి రావడానికి అనుమతి లేని, ఎలాంటి ప్రభావం లేని కొందరు వ్యక్తులు చెప్పిన తప్పుదోవ పట్టించే మాటలతో ఈ పుస్తకం నిండిపోయింది’’ అని పేర్కొన్నారు.