ట్రంప్‌ నిర్ణయంతో మన ఐటీకి మేలు: ముకేశ్

0Mukesh-Ambaniఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశీయ ఐటీ పరిశ్రమపై పడుతుందన్న ఆందోళనలను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తోసిపుచ్చారు. వాస్తవానికి ట్రంప్ విధానాలు, చేపడుతున్న రక్షణాత్మక ఆర్థిక విధానాలే దేశీయ ఐటీ పరిశ్రమకు వరం లాంటిదని వ్యాఖ్యానించారు. ఆందోళనలన్నీ పక్కనపెట్టి దేశీయ ఐటీ వృద్ధికి కృషి చేయాలని ఆయన ఐటీ పరిశ్రమను కోరారు. నాస్కామ్ ఇండియా లీడర్‌షిప్ ఫోరం వార్షిక సమావేశాల ప్రారంభ సందర్భంగా ముకేశ్ మాట్లాడుతూ.. ట్రంప్ విధానాలు, మరో రూపంలో ఐటీ పరిశ్రమకు సహాయం చేస్తున్నట్లే అని చెప్పారు. దేశీయ ఐటీ మార్కెట్ భారీగా ఉన్న నేపథ్యంలో దేశంలోని ఐటీ సమస్యలను పరిష్కరించడంతో ఐటీ కంపెనీలు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచ గోడలు నిర్మించాలని, ఆలోచిస్తుండవచ్చు.. కానీ దానికి ఇండియా ప్రభావితం కావాల్సిన అవసరం లేదన్నారు. దేశీయ ద్వారాలు తెరిచే ఉంచాలని ఆయన సూచించారు.

అపజయాలు ఎదురైన వెనుకడుగు వేయలేదు..

పలు వ్యాపారాల్లో అపజయాలు ఎదురైనప్పటికీ వెనుకడుగు వేయలేదని ముకేశ్ అంబానీ స్పష్టంచేశారు. పెట్టుబడిదారులు అతి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, పెట్టుబడులు పెట్టిన వెంటనే లాభాలు రావని, కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపారంలో మెలుకువలు తన తండ్రి ధీరుభాయి అంబానీ నుంచి నేర్చుకున్నానని చెప్పారు. పరిష్కరించలేని సమస్య ఏది లేదని, దానికోసం కృషి చేయాలని ఆయన సూచించారు.

డాటాతో నాలుగో పారిశ్రామిక విప్లవం..

డాటాతో నాలుగో పారిశ్రామిక విప్లవం రానున్నదని ముకేశ్ పేర్కొన్నారు. టెలికం రంగంలోకి ప్రవేశించిన జియోతో డిజిటల్ రంగం కొత్త పుంతలు తొక్కుతుందని, డాటా కూడా సహజంగా లభించేదని ఆయన వ్యాఖ్యానించారు. బ్రాడ్‌బ్యాండ్ వినిమయంలో 2015లో 155వ స్థానంలో ఉన్న భారత్ జియో రంగప్రవేశం చేయడంతో టాప్-10లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. జియో సేవలు ప్రారంభించిన అనతికాలంలోనే వినియోగదారుల సంఖ్య 10 కోట్లు దాటిందని ఆయన వెల్లడించారు.

ఆంక్షలతో ఆందోళన పెరిగింది: చంద్రశేఖరన్

హెచ్1-బీ వీసాలపై ట్రంప్ కఠిన ఆంక్షలు విధించడంతో దేశీయ ఐటీ సంస్థల్లో ఆందోళన మరింత తీవ్రతరమైందని టీసీఎస్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. 155 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న దేశీయ ఐటీ ఇండస్ట్రీకి అమెరికా నుంచి అత్యధిక ఆర్డర్లు వస్తున్నాయన్నారు.