వి6 న్యూస్ రీడర్ రాధిక ఆత్మహత్య

0ప్రముఖ చానెల్ v6లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న వెంకన్నగారి రాధిక రెడ్డి(36) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని మూసాపేట గూడ్స్‌షెడ్‌ రోడ్డులోని సువీలా అపార్ట్‌మెంట్‌లో.. ఐదో అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. గత ఐదేళ్లుగా ఆమె ఇక్కడే నివాసముంటున్నట్టు తెలుస్తోంది. ఆదివారం రాత్రి 10.30గం. సమయంలో విధుల నుంచి తిరిగొచ్చిన ఆమె.. నిమిషాల వ్యవధిలోనే అపార్ట్‌మెంట్‌ ఆరో అంతస్తు పైకి పరుగున వెళ్లినట్టు అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్నారు. ఆమెను గమనించి.. కొంతమంది పైకి వెళ్లగా.. అప్పటికే ఆమె కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఆత్మహత్యకు సంబంధించి ఆమె బ్యాగ్‌లో ఒక సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. ‘కేవలం నా డిప్రెషన్‌ వల్ల మాత్రమే చనిపోతున్నాను. నా మెదడు నా శత్రువు’ అని అందులో పేర్కొనడం గమనార్హం. కాగా, ఆరు నెలల క్రితం ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు సమాచారం. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న తన 14 ఏళ్ల కుమారుడు, తల్లిదండ్రులతో కలసి.. ఆమె ఈ అపార్ట్ మెంటులో నివసిస్తున్నారు. రాధిక ఆత్మహత్య సమాచారం అందిన వెంటనే కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 10.50గం. సమయంలో రాధికా ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్పారు. సూసైడ్ నోట్ ని బట్టి ఇది బలవన్మరణంగానే భావిస్తున్నామని, మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉందని తెలిపారు.