విష మేఘాలు: 233 మంది ఆసుపత్రి పాలు

0two-hundred-treated-for-chlorine-cloudsక్లోరిన్‌ వాయు మేఘాలు ఇంగ్లండ్‌లోని ఈస్ట్‌ ససెక్స్‌లో కలకలం రేపాయి. బీచ్‌లో సేద తీరుతున్న ప్రజలను విష వాయువు తాకడంతో కళ్ల మంటలు, గొంతు రాజుకుపోవడం, ఊపిరాడకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని 233 మందికి పైగా బాధితులను అంబులెన్స్‌ల సాయంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఒక్కసారిగా వచ్చిన విష వాయు మేఘం నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చిందని బీచ్‌లోని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఆ తర్వాత ఆ వాయువు పీల్చుకున్న ప్రతి వ్యక్తికి ఏదో రకమైన ఇబ్బంది ఎదుర్కొన్నట్లు చెప్పారు. కాగా, ఆసుపత్రికి తరలించిన బాధితులకు డాక్టర్లు ప్రత్యేక సూట్లు వేసుకుని వైద్య సేవలు అందిస్తున్నారు.

విష వాయువును పీల్చుకున్న వ్యక్తి నుంచి వెలువడే గాలి కూడా ప్రమాదమేనని చెబుతున్నారు. బీచ్‌ వైపు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బీచ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్లోరిన్‌ వాయువు బీచ్‌ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నుంచి వెలువడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, అధికారులు ఈ కోణాన్ని కొట్టిపారేస్తున్నారు. అలాంటిది జరిగే కచ్చితంగా ఆధారాలు లభ్యమవుతాయన్నారు. గ్యాస్‌ ఎక్కడి నుంచి వెలువడిందనే దానికి అసలు ఆధారాలేవి ఇప్పటివరకూ లభ్యం కాలేదని చెప్పారు.