నెలకే యు టర్న్ తీసుకుంది!!

0

అమెజాన్ ప్రైమ్ వచ్చాక సినిమాల హక్కుల విషయంలో నిర్మాతకు అదనపు ఆదాయ వనరుగా మారడం సంగతి అటుంచి కొత్త సినిమా కోసం థియేటర్ కు వెళ్లకుండా నెల రోజులు ఓపిక పడితే చాలు హెచ్ది లో చూసుకోవచ్చనే అభిప్రాయాన్ని మాత్రం బలపరుస్తున్నారు. ఈ ఏడాది చాలా స్పీడుమీదున్న అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ విషయంలో దూకుడుని తగ్గించడం లేదు. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ని 45 రోజులకు భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ ని 52 రోజులకు విడుదల చేసి రికార్డు సృష్టించిన ఈ యాప్ ఇప్పుడు వ్యవధిని ఇంకా కుదించుకుంటూ పోతోంది.

గత నెల 13న వినాయక చవితి పండగ సందర్భంగా విడుదలైన సమంతా యుటర్న్ సరిగ్గా నెల రోజులకే అమెజాన్ ప్రైమ్ లో వచ్చేస్తోంది. ఇది కాస్త త్వరగానే అని చెప్పాలి. యుటర్న్ కు టాక్ తో పాటు రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. కానీ సామ్ వాటిని వసూళ్ల రూపంలో మార్చుకోవడంలో విఫలం కావడంతో ఫైనల్ గా కాస్ట్ ఫెయిల్యూర్ గానే మిగిలింది. ఇప్పుడు యుటర్న్ ప్రకటన చూసి గీత గోవిందం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అమెజాన్ ప్రైమ్- నెట్ ఫ్లిక్స్ – -సన్ నెక్స్ట్- ఏఎన్టి బాలాజీ- జీ 5 ఇలా పేరొందిన యాప్స్ ఒక్కొక్కటిగా కొత్త సినిమాల మీద దృష్టి పెడుతున్నాయి. అజ్ఞాతవాసి-తొలిప్రేమ సినిమాలను తన జెమిని ఛానల్ కన్నా ముందే సన్ నెక్స్ట్ యాప్ లో పెట్టడాన్ని బట్టి ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ప్రభావం ఎంత ఉందొ అర్థం చేసుకోవచ్చు.

అర్జున్ రెడ్డి గతంలో అమెజాన్ ప్రైమ్ లో వచ్చినప్పుడు దాని వల్లే సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవాళ్ళు ఉన్నారు. అందుకే కొత్త ట్రెండ్ ఏంటంటే టైటిల్ కార్డ్స్ లో వీడియో పార్టనర్ ఎవరున్నారో చూసి దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతున్నారు యూత్. అమెజాన్ ప్రైమ్ సైతం ప్రీ రిలీజ్ పోస్టర్ లు మొదలుకుని టైటిల్ కార్డ్స్ దాకా అన్ని చోట్లా తన లోగో ఉండేలా ఒప్పందం చేసుకుని మరీ మార్కెటింగ్ చేసుకుంటోంది. ఇది ఈ ముప్పై రోజుల గడువు దగ్గర ఆగితే బెటర్. లేదూ అంత కన్నా తక్కువ అయితే మాత్రం రానున్న రోజులు సినిమా ఓపెనింగ్స్ ఇంకా క్లిష్టంగా మారడం ఖాయం.
Please Read Disclaimer