ట్రైలర్ టాక్: U టర్న్ దగ్గర ఏం జరిగింది?

0సమంతా అక్కినేని – ఆది పినిశెట్టి – రాహుల్ రవీంద్రన్ – భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా తెలుగు చిత్రం ‘U టర్న్’. అదే పేరుతో సూపర్ హిట్ అయిన కన్నడ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను నిర్మాతలు కాసేపటి క్రితం రిలీజ్ చేశారు.

2.08 నిముషాల నిడివి గల ట్రైలర్ ఒక డిమ్ గా ఉన్న బార్ కౌంటర్ లో స్టార్ట్ అయింది. సమంతా అక్కడ కూర్చుని “నేను ఈ రకంగా బార్ కౌంటర్ లో ఇన్ని శబ్దాల మధ్య ఇలా కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు.. ఈ ఐదు రోజులు నా లైఫ్ లో జరిగిందంతా నిజమా అబద్దమా?” అని ఆలోచిస్తూ ఉంటుంది.నెక్స్ట్ సీన్ లో ఆర్కే పురం ఫ్లై ఓవర్ దగ్గర జరిగిన యాక్సిడెంట్స్ రికార్డ్స్ కోసం సమంతా వెతుకుతూ ఉంటుంది. పోలీసులేమో సమంతాను ‘ఎందుకు చంపావతన్ని? అన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటారు. సమంతా మాత్రం నేను ఎందుకు చంపుతాను మొర్రో అని మొత్తుకుంటూ ఉంటుంది. మరోవైపు రాహుల్ రవీంద్రన్ సగం సగం డైలాగులతో సస్పెన్స్ పెంచుతుంటాడు. ఆది పినిశెట్టి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ కనిపించాడు.

ట్రైలర్ అంతా ఒక పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నామనే ఫీల్ కలిగించారు. మరి ఆ ఐదు రోజుల్లో సమంతా ఏం చేసింది.. ఆ యాక్సిడెంట్స్ కు సామ్ కు లింక్ ఏంటి? పోలీసులు ఆమెను ఎందుకు అనుమానిస్తున్నారు. అసలు రాహుల్ ఏం చెప్తున్నాడు? చాలానే ప్రశ్నలున్నాయి. ఈ మిస్టరీ కి అన్సర్ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 13 న రిలీజ్ అవుతోంది. మరి అంతలోపు మీరూ ట్రైలర్ పై ఒక లుక్కేయండి..