సునీల్ లో మార్పు రాదా?

0ఒకప్పుడు మాస్ మంత్రం పఠించిన హీరోలందరూ కూడా ఈ మధ్య చాలా మారిపోయారు. వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తున్నారు. రొటీన్ వేషాలకు సెలవిచ్చేశారు. డ్యాన్సుల మీద.. ఫైట్ల మీద.. కమర్షియల్ అంశాల మీద అంతగా ఫోకస్ పెట్టట్లేదు. కొత్తదనం మీద.. కంటెంట్ మీద దృష్టిపెడుతున్నారు. ఒకప్పుడు మాస్ మాస్ అన్న నందమూరి బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ లాంటి హీరోలు ఈ మధ్య కాలంలో ఎంతగా మార్పు చూపించారో తెలిసిందే. మిగతా స్టార్ హీరోలు ఇంకా ముందు నుంచే మారిపోయారు. మరి స్టార్ హీరోలే వైవిధ్యం కోసం అంతగా తపిస్తున్నపుడు సునీల్ లాంటి కమెడియన్ టర్న్డ్ హీరో ఇంకెంత కొత్తదనం కోసం ప్రయత్నించాలి..?

కానీ సునీల్ మాత్రం రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలే చేస్తూ వస్తున్నాడు. వరుసగా ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నాడు. భీమవరం బుల్లోడు.. కృష్ణాష్టమి.. జక్కన్న.. ఈడు గోల్డ్ ఎహే.. అన్నీ కూడా పాత చింతకాయ పచ్చడి కథలతో తెరకెక్కిన సినిమాలే. ఇందులో కథాకథనాల సంగతి పక్కనబెడితే.. తనను తాను ఒక మాస్ హీరోలా ప్రొజెక్ట్ చేసుకోవడానికి సునీల్ చేసిన ప్రయత్నం జనాలకు విసుగు తెప్పించింది. భారీ సెట్టింగులు.. బోలెడంత మంది డ్యాన్సర్లు.. జిగేల్ జిగేల్ డ్రెస్సులు.. కఠినమైన స్టెప్పులు.. ఇలా సునీల్ ఫోకస్ మొత్తం వేరేలా ఉంటోంది. స్టార్ హీరోలు చేస్తేనే ఇలాంటివి జనాలు చూడట్లేదు. మరి సునీల్ కూడా అలాంటివి ట్రై చేస్తే ఎలా? ఇప్పటిదాకా అతను ఎలాంటి సినిమాలు చేసినప్పటికీ.. ఓనమాలు.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మంచి సినిమాలు చేసిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తున్నాడు కాబట్టి ‘ఉంగరాల రాంబాబు’లో కొత్తదనం కోసం ప్రయత్నం చేసి ఉంటాడేమో అనుకున్నారంతా. కానీ ఈ సినిమాలో ఒక పాట చిత్రీకరణ తాలూకు మేకింగ్ వీడియో చూస్తుంటే మాత్రం సునీల్ ఈసారి కూడా ఏం మార్పు చూపించేలా కనిపించట్లేదు. భారీ సెట్టింగ్ మధ్య సునీల్ తన డ్యాన్సింగ్ టాలెంట్ చూపించే ప్రయత్నం చేశాడిందులో. క్రాంతి మాధవ్ సినిమాల్లో ఇలాంటి సెట్టింగ్.. డ్యాన్సింగ్ సాంగ్ ఉంటుందని ఎవరూ ఊహించరు. ‘ఉంగరాల రాంబాబు’లో క్రాంతి మాధవ్ స్టయిల్లోకి సునీల్ మారతాడనుకుంటే.. క్రాంతి మాధవే సునీల్ స్టయిల్లోకి మారాడేమో అనిపిస్తోంది ఈ వీడియో చూస్తుంటే. తనను తాను ఒక మాస్ హీరోలా ఫీలైపోతూ.. ప్రతి సినిమాలోనూ తన డ్యాన్సింగ్.. ఫైటింగ్ టాలెంట్స్ చూపించడానికి సునీల్ ప్రయత్నిస్తుండటంపై ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. ఐతే వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నా సునీల్ లో మాత్రం మార్పు కనిపించట్లేదు. మరి ‘ఉంగరాల రాంబాబు’ పాటలు మాత్రమే సునీల్ స్టయిల్లో ఉంటాయా.. లేక సినిమా అయినా క్రాంతి మాధవ్ స్టయిల్లో ఉంటుందా అన్నది చూడాలి.