సర్వే లెక్కల్ని చెప్పి ఉత్తమ్ షాకిస్తున్నారుగా!

0

ముందు నుంచి ఊహించినట్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా అస్సలు సాగటం లేదు. మొదట్నించి గెలుపు మీద కాన్ఫిడెంట్ గా ఉన్న టీఆర్ఎస్ కు సందేహం కలిగేలా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ ను సింఫుల్ గా ఓడించొచ్చన్న ఆశ అత్యాశేనన్న విషయం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. పట్టు బిగించేందుకు కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ మాట్లాడుతూ.. తమ పార్టీ తాజాగా ఒక సర్వేను రూపొందించిందని.. దాని ఫలితాలుతాజాగా వచ్చినట్లు వెల్లడించారు. తమ సర్వే ఫలితాల ప్రకారం టీఆర్ఎస్కు 20 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని.. మహాకూటమి 80 స్థానాల్లో గెలుపు పక్కా అని చెబుతున్నారు. రోజులు గడిచే కొద్దీ టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని.. మహాకూటమి అంతకంతకూ బలం పెరుగుతోందన్నారు. ముందస్తుకు వెళుతూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ పతనానికి కారణమైందన్నారు.

ఆరు నూరైనా కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమన్న ఉత్తమ్.. టీఆర్ఎస్ నేతలు ఆశల పల్లకిలో తేలుతున్నారని.. వారికి రోజులు దగ్గరకు పడ్డాయన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టూర్ ను డ్రామాగా అభివర్ణించిన ఉత్తమ్.. షా.. కేసీఆర్ ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని ప్లాన్ చేశారన్నారు.

తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో సోనియా.. రాహుల్ ఇద్దరూ కలిసి మొత్తం 12 సభల్లో పాల్గొంటారన్నారు. సోనియా మూడు సభల్లో.. రాహుల్ తొమ్మిది సభల్లో పాల్గొంటారన్నారు. పది నియోజకవర్గాల్ని కలుపుకొని ఒక బహిరంగ సభ పెట్టేలా ప్లాన్ ఉంటుందన్నారు.

టీఆర్ఎస్ నుంచి చాలామంది కీలక నేతలు తమతో టచ్ లో ఉన్నారని.. వారంతా కేసీఆర్కు షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అతి త్వరలోనే కీలక నేతల చేరికలు ఉంటాయన్న ఉత్తమ్ మాటలు వినేందుకు బాగున్నా.. ఇలా వన్ సైడెడ్ గా ఎలక్షన్ జరుగుతుంటే కేసీఆర్ అలా చూస్తూ ఊరుకుంటారా ఏంటి?
Please Read Disclaimer