వక్కంతం.. ఎవరిస్తారు ఛాన్స్?

0రచయితగా కొంచెం పేరు రావడం ఆలస్యం మెగా ఫోన్ పట్టేస్తున్నారు చాలామంది. చిన్నా చితకా రైటర్లు సైతం దర్శకులైపోయారు. కానీ రచయితగా ఎప్పుడో స్టార్ స్టేటస్ సంపాదించిన వక్కంతం వంశీ మాత్రం దర్శకుడు కావడానికి చాలా సమయం పట్టింది. అతను దర్శకుడిగా ఏదో ఒక సినిమా చేసేయాలని అనుకోలేదు. పెద్ద హీరోలతో గ్రాండ్ లాంచ్ ఉండాలనే కోరుకున్నాడు. అందుకే చాలా ఏళ్లు వెయిట్ చేశాడు. ముందు జూనియర్ ఎన్టీఆర్ తో అతడి సినిమా ఓకే అయి.. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత నిరాశ చెందకుండా అల్లు అర్జున్ కోసం ప్రయత్నించాడు. ‘నా పేరు సూర్య’ సినిమాను ఓకే చేయించుకున్నాడు. ఒక స్టార్ డైరెక్టర్ ను నమ్మినట్లుగా అందరూ వక్కంతంను నమ్మారు. భారీ బడ్జెట్ ఇచ్చి ఈ సినిమా తీయించారు.

ఒక తొలి చిత్ర దర్శకుడి సినిమాకు ఎన్నడూ లేనంత బిజినెస్ కూడా జరిగింది ‘నా పేరు సూర్య’కు. కానీ ఏం లాభం సినిమా నిలబడలేదు. రూ.25 కోట్ల పైగా నష్టాలు తెచ్చిపెట్టిందా సినిమా. దీనికి టాక్ ఏమంత బ్యాడ్ గా లేకపోయినా.. వచ్చిన ఫలితం ప్రకారం చూస్తే మాత్రం డిజాస్టర్ అనే చెప్పాలి. మొత్తానికి దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే తనకు దక్కిన పెద్ద అవకాశాన్ని వక్కంతం సద్వినియోగం చేసుకోవడం లేదు. సినిమా రిలీజైన సమయానికి.. ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది. అప్పుడు దర్శకుడిగా వక్కంతం ప్రతిభ గురించి మాట్లాడిన వాళ్లు ఇప్పుడు అతడి వైఫల్యం గురించే చర్చించుకుంటున్నారు. సినీ రంగంలో సక్సెస్ అన్నది ఎంత కీలక పాత్ర పోషిస్తుందో చెప్పేదేముంది? ముందు వక్కంతంకు హామీ ఇచ్చిన హీరోలు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారట. వేరే ప్రాజెక్టులున్నాయన్న కారణాలు చెప్పి అతడికి హ్యాండిస్తున్నారట. వక్కంతం రెండో సినిమా చేయాల్సిన అగ్ర కథానాయకుడు దాదాపుగా నో చెప్పేసినట్లే అంటున్నారు. కాబట్టి రెండో సినిమా విషయంలోనూ మళ్లీ వక్కంతంకు స్ట్రగుల్ తప్పేలా లేదు.