వరలక్ష్మి కాదు నీలాంబరి!?

0తెలుగు కుర్రాడైన విశాల్ లోని ఒగరు పొగరు గురించి తెలిసిందే. అతడు కోలీవుడ్ లో అగ్రకథానాయకుడిగా రాజ్యమేలుతున్నాడు. ప్రస్తుతం తన రేంజే వేరు. హీరోగా – నిర్మాతగా – నడిగర సంఘం కార్యదర్శిగా – నిర్మాతల మండలి అధ్యక్షుడిగా .. ఒకటేమిటి అన్ని పదవులు అతడివే. రియల్ హీరోయిజం చూపిస్తున్నాడు. వీటన్నిటికీ మించి తనకు వ్యక్తిగత – వృత్తిగత జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అతడు ఎదుర్కొంటున్న తీరు ఎంతో ఆసక్తికరం.

అయితే ఇంత ట్యాలెంటు ఉన్న విశాల్ ఇంకా బ్యాచిలర్గానే ఎందుకున్నాడు? అతడు పెళ్లి చేసుకోడా? ఇలాంటి డౌట్స్ ఎన్నో ఉన్నాయి అభిమానులకు. ఇదే ప్రశ్న విశాల్ భయ్యానే అడిగితే.. పెళ్లి అప్పుడే ఎందుకు? అని ఎదురు ప్రశ్నిస్తాడు. తనలో తానే ముసిముసిగా నవ్వేసుకుంటూ అసలు ఈ పెళ్లి గోలేంటో! అనేసుకుంటాడు. అయితే అతడు అలా అనుకోవడం వెనక చాలానే కథ ఉంది. నటుడు – నిర్మాత శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మిని విశాల్ ప్రేమించాడన్న ప్రచారం ఉంది. ఆ ఇద్దరి మధ్యా చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఆ స్నేహం ప్రేమగా మారిందని చెబుతారు. అయితే తనని పెళ్లాడాలంటే మధ్యలో శరత్ కుమార్ అడ్డుకున్నారని – కట్ చేస్తే `మామ- అల్లుళ్ల` మధ్య ఫిలింఛాంబర్ – నిర్మాతల మండలి – నడిగర సంఘంలో ఎన్నికల వేళ గొడవలయ్యాయని కోలీవుడ్ మీడియా ప్రచారం చేసింది. ఒకరంటే ఒకరికి గిట్టని శత్రువులుగా అక్కడ ఎన్నికల్లో పోటీకి దిగారు. చివరికి శరత్ కుమార్ పై నెగ్గి సత్తా చాటాడు విశాల్. రియల్ హీరోయిజం చూపించాడు. దీంతో శరత్ కుమార్ లో ఈగో ఇంకా పెరిగింది. అది ప్రేమకు మరింతగా అడ్డొచ్చిందన్న కొత్త ప్రచారం సాగింది. అంతేకాదు.. నడిగరసంఘం సొంత బిల్డింగ్ కట్టాక అందులో తొలి పెళ్లి నాదే! అని సవాల్ విసిరాడు విశాల్ ఎన్నికల వేళ. ఈ రియల్ లైఫ్ కథంతా ఒక రీల్ లైఫ్ లవ్ – రివెంజ్ స్టోరీలా అనిపిస్తోంది కదూ? కానీ ఇది నిజమని ప్రచారం సాగింది. అదంతా నిజమా అని ప్రశ్నిస్తే విశాల్ – వరలక్ష్మి తాము స్నేహితులం మాత్రమేనని తెలిపారు. ప్రస్తుతం విశాల్ తాను హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం `పందెంకోడి 2`లో వరలక్ష్మికి విలన్ పాత్రను ఇచ్చాడు. తన ప్రేయసే విలన్ అయితే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్టు ప్రస్తుతం అటు కోలీవుడ్ – టాలీవుడ్ లో చర్చకొచ్చింది.

తాజాగా రిలీజైన `పందెంకోడి 2` ట్రైలర్లో వరలక్ష్మి విలనీ అదిరిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. రమ్యకృష్ణ నరసింహా చిత్రంలో చేసిన నీలాంబరి పాత్రను మరిపిస్తోందన్న ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే పూర్తి సినిమాలో తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంది? అన్నది చూడాలి. ఒకవేళ `నరసింహా`లో రమ్యకృష్ణ అంత మెప్పిస్తుందా? వరలక్ష్మికి అంత స్కోప్ ఉందా? అంటూ డిస్కషన్ సాగుతోంది. అయితే ట్రైలర్ లో కనిపించిన రెండు బిట్స్లో ఆ కసి వరలక్ష్మిలో కనిపిస్తోంది. చీర-రవికెలో – ముకుపుడకతో పొగరు ఒగరు ఉన్న అమ్మడిలా కనిపిస్తోంది. అందుకే ఫ్రెండు కం ప్రియురాలు వరలక్ష్మి.. విశాల్ కి విలన్ అయ్యింది.. వ్వాటే కాంబినేషన్..!! అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంట్రెస్టింగ్ కదూ?