అర్జున్ రెడ్డి రీమేక్ కి “వర్మ” అని టైటిల్

0varma-first-lookచిన్న సినిమాగా విడుదలై తెలుగులో ఘన విజయం అందుకున్న చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. కేవలం రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు రూ.50 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం యువతలో హీరో విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ను మరింత పెంచింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. అగ్ర కథానాయకుడు విక్రమ్‌ కుమారుడు ధ్రువ ఈ రీమేక్‌తో అరంగేట్రం చేస్తున్నారు. కాగా ఈ రీమేక్‌కు ‘వర్మ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శుక్రవారం చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. తన పేరుతో ఉన్న ఈ టైటిల్‌ను ఎక్కడో విన్నట్టుందే? అని సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘అర్జున్‌రెడ్డి’ తమిళ వెర్షన్‌ పేరు ‘వర్మ’ అంట.. ఆ పేరు ఎక్కడో విన్నట్టు, గుర్తున్నట్టు ఉంది’ అంటూ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీంతోపాటు ‘వర్మ’ సినిమా పోస్టర్‌ను పంచుకున్నారు. దీనికి అభిమానులు తెగ కామెంట్స్‌ చేశారు. ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ‘వర్మ’ టైటిల్‌ను రీమేక్‌కు సూచించి ఉంటారని అన్నారు.

‘వర్మ’ చిత్రానికి బాల దర్శకత్వం వహిస్తున్నారు. ముకేశ్‌ రాతీలాల్‌ మెహతా నిర్మాత. ఎం. సుకుమార్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయిక షాలిని పాండే పాత్రలో ఎవరు కనిపించనున్నారు అనే విషయం ప్రకటించాల్సి ఉంది. దక్షిణ చిత్ర పరిశ్రమలో విశేష ప్రేక్షకాధరణ ఉన్న విక్రమ్‌ కుమారుడు ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతోన్న నేపథ్యంలో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.