అతడితో వరుణ్ తేజ్ మూవీ?

0మూస పద్దతిలో కాకుండా ఎంట్రీ నుంచి తనదైన బాటలో సాగుతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇమేజ్ చట్రంలో చిక్కుకోకుండా.. ఒక సినిమా తర్వాత మరో సినిమా అన్నట్లుగా సాగుతోంది. సినిమాకు సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా.. చకచకా ప్రాజెక్టులకు ఓకే చెప్పేస్తున్న వరుణ్ తేజ్ చేతిలో ఇప్పటికే రెండు సినిమాలు ఉన్నాయి. తన ప్రతి సినిమాలోనూ కొత్తదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకెళుతున్నాడు.

ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ తో కలిసి ఎఫ్2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతి రేసులో ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మరోవైపు అంతరిక్షం నేపథ్యంలో సాగు మూవీలోనూ తేజ్ నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ అవుతుందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్టుకు ఆయన ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మేం వయసుకు వచ్చాం అంటూ ఆరేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చి.. తర్వాతి కాలంలో నువ్విలా నేనిలా.. ప్రియతమా నీవచట కుశలమా.. సినిమా చూపిస్త మావా.. అంటూ తనదైన మార్క్ ను ప్రతి సినిమాలో చూపిస్తూ.. ఇటీవల నేను లోకల్ మూవీ చేసిన దర్శకుడు త్రినాథ రావ్ నక్కిన దర్శకత్వంలో సినిమాకు తేజ్ ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు.

మైత్రీ మూవీస్ నిర్మించే ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు చేపట్టారు. ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.