‘కేరాఫ్ కంచరపాలెం’ కు వెంకీమామ ఫిదా!

0మూస సినిమాలకు స్వస్తి పలుకుతూ టాలీవుడ్ లో కొంతకాలంగా విభిన్న కథాంశాలతో చిత్రాలు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. విభిన్న తరహా చిత్రాలతో పాటు కథ – కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులూ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని చాలాసార్లు నిరూపితమైంది. గత ఏడాది విడుదలైన అర్జున్ రెడ్డి – ఈ ఏడాది విడుదలైన ఆర్ ఎక్స్ 100 లకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అదే కోవలో ఈ రోజు మరో విభిన్న కథా చిత్రం `కేరాఫ్ కంచరపాలెం` విడుదలైంది. న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైన తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. విడుదలకు ముందే ఈ చిత్రం పలువురు సెలబ్రిటీల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా చూసిన విక్టరీ వెంకటేష్ ….చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. తెలుగులో ఇది మరో పాథ్ బ్రేకింగ్ మూవీ అని వెంకీ అన్నాడు.

నూతన దర్శకుడు వెంకటేశ్ మహా తెరకెక్కించిన `కేరాఫ్ కంచరపాలెం` నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికాలో వైద్యురాలిగా పనిచేస్తోన్న పరుచూరి విజయ ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపుగా కొత్త నటీనటులతో – సహజత్వానికి దగ్గరగా పాత్రలను చిత్రీకరించిన ఈ చిత్రంపై రాజమౌళితో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా వెంకీ కూడా ఈ సినిమాకు ఫిదా అయ్యాడు. ఇది చాలా బ్రిలియంట్ ఫిల్మ్ .. అని తనకు బాగా నచ్చిందని వెంకీమామ అన్నాడు. తెలుగు సినిమాను సరికొత్త మార్గంలో ఈ సినిమా నడిపిస్తుందని అనిపిస్తోంది. ప్రేక్షకులపై ఈ సినిమా మంచి ప్రభావాన్ని చూపుతుందని వెంకీ అభిప్రాయపడ్డాడు. ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాను రానా సమర్పించడం తనకు గర్వంగా ఉందని వెంకీ అన్నాడు. చిత్ర యూనిట్ కు దర్శక నిర్మాతలకు .. నటీనటులకు శుభాకాంక్షలు తెలిపారు.