నంద్యాల: రోజా, జగన్‌లపై వేణుమాధవ్ సెటైర్లు

0venu-madhav-satires-on-rojaవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీకి వీరాభిమాని అయిన సినీ కమెడియన్ వేణు మాధవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, ఎంపీ టీజీ వెంకటేష్‌లతో కలిసి నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వేణు మాధవ్ తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. భూమా కుటుంబం తనకు సొంత కుటుంబంలాంటిదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మంత్రి భూమా అఖిలప్రియ తన అన్న బిడ్డ అని, తనకు కూమార్తెలాంటిదని తెలిపారు.

జగన్ చేస్తున్న ప్రచారం టీడీపీకి ఎంతో లాభిస్తోందని… ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని వేణుమాధవ్ చెప్పారు. ఎప్పటికీ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆయనకే ఓటర్లంతా మద్దతును ప్రకటించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాపై వేణుమాధవ్ సెటైర్లు వేశారు. ‘నా బిడ్డ అఖిలప్రియపై ఎవరో ఏదో కామెంట్ చేశారట’ అన్న వేణుమాధవ్… ఎవరామె? ఏం చేస్తుంటుంది? అంటూ.. చుట్టూ ఉన్న అభిమానులను అడిగారు. దానికి సమాధానంగా అక్కడున్నవారంతా ‘రోజా’ అంటూ గట్టిగా అరిచారు. దీంతో, రోజా అంటే మీకు అర్థం తెలుసా అంటూ ప్రశ్నించి… రోజాకు కొత్త నిర్వచనం చెప్పారు వేణు.

‘రోజా’ అంటే ‘రో’ యహాసే ‘జా’ (ఏడ్చుకుంటూ ఇక్కడ నుంచి వెళ్లు అని తెలుగులో అర్థం) అని చెప్పారు. ‘ఆమెలా టాటూలు వేసుకుని, చిన్నచిన్న డ్రెస్సులు వేసుకుని, డ్యాన్సులు…’ అని తాను అనలేనని, అలాంటి అసభ్యకరమైన మాటలు తాను మాట్లాడనని విమర్శించాడు. ఆడవాళ్లంటే తనకు ఎంతో గౌరవమని… వారిపై తాను ఎలాంటి విమర్శలు చేయనని చెప్పాడు.

కాగా, ఏమైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తారేమోనని టీజీ వెంకటేష్, భూమా బ్రహ్మానందరెడ్డి.. వేణు మాధవ్‌ను వారించే యత్నం చేశారు. కానీ, వేణు మాధవ్ ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వేణుమాధవ్ విన్నవించాడు. టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్.. ప్రజలకు ఎక్కడ సౌకర్యాలు లేకున్నా.. అక్కడికి వెళ్లి వారి ఇబ్బందులను తొలగిస్తారని వేణుమాధవ్ ఈ సందర్బంగా తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ టీజీ ముందుంటారని ప్రశంసించారు.

ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న విమర్శలు గుప్పించారు వేణుమాధవ్. గుర్తు తెలియని వారే వారి గుర్తును పట్టుకుని తిరగుతారని… మనకు ఏం అవసరం తమ్మి? అని అక్కడివారిని ప్రశ్నించారు. కాగా, రోడ్ షోలో ఇదే మన గుర్తు అంటూ ఫ్యాన్ ను ఓటర్లకు జగన్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. మన గుర్తు మన గుండెల్లోనే ఉందని వేణు మాధవ్ చెప్పారు. గుర్తులు పట్టుకుని తిరగాల్సిన అవసరం మనకు లేదని అన్నారు.

టీడీపీ గెలుపు గురించి ఇప్పుడు ఎవరికీ రెండో ఆలోచన లేదని… ఎంత మెజార్టీ అనేదే టెన్షన్ అని వేణుమాధవ్ చెప్పారు. తాను ప్రచారానికి రాలేదని… టీడీపీకి ఎంత మెజార్టీ వస్తుందో చూద్దామనే వచ్చానని అన్నారు. యువకుడు, అందగాడు, బాగా పని చేసే వ్యక్తి భూమా బ్రహ్మానందరెడ్డి అన్న వేణు మాధవ్… కాకపోతే తనకంటే ఒక అడుగు ఎత్తుగా ఉంటాడని సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కని విధంగా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని విన్నవించాడు. అక్కా, బావా అంటూ… తెలుగు, హిందీలో వేణుమాధవ్ చేసిన ప్రచారం అభిమానులను ఆకట్టుకుంది. ఆయన ప్రసంగం చేస్తున్నంత సేపు టీడీపీ అభిమానులు కేకలు వేస్తూ మద్దతు తెలిపారు.