‘దేవదాస్’ అంచనాలు పెంచేస్తున్నారు

0నాగార్జున – నాని కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’ విడుదలకు సిద్దం అవుతుంది. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. శ్రీరామ్ ఆధిత్య దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్ మరియు సాంగ్ తో సినిమాపై ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువ అవుతుంది. ఈ సమయంలోనే ఈ చిత్రంను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 పంపిణీ హక్కులు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు పలు బాలీవుడ్ సంస్థలు టాలీవుడ్ చిత్రాలను కొనుగోలు చేసి పంపిణీ చేయడం జరిగింది.

‘దేవదాస్’ చిత్రంతో మొదటి సారి హిందీ చిత్రాల ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన వయాకామ్ 18 టాలీవుడ్ లో అడుగు పెట్టబోతుంది. ఈ సందర్బంగా నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. వయాకామ్ 18 సంస్థతో భాగస్వామ్యం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. వారితో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాం. టాలీవుడ్ తరపున వయాకామ్ సంస్థ వారికి స్వాగతం పలుకుతున్నాం అన్నారు. వయాకామ్ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. అశ్వినీదత్ గారి భాగస్వామ్యంలో ‘దేవదాస్’ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని టాలీవుడ్ లో మంచి అనుభవం ఉన్న అశ్వినీదత్ గారి వల్ల మా సంస్థ ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటుందని భావిస్తున్నాం అన్నారు.

‘దేవదాస్’ చిత్రంను బాలీవుడ్ నిర్మాణ సంస్థ కొనుగోలు చేయడంతో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. అశ్వినీదత్ గత చిత్రం ‘మహానటి’తో ఏ స్థాయి విజయాన్ని దక్కించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే తరహాలో భారీ లాభాలతో ఈ చిత్రంను అమ్మేసినట్లుగా సమాచారం అందుతుంది. దసరాకు రెండు వారాల ముందే రాబోతున్న ఈ చిత్రం పండగను రెండు వారాల ముందే తీసుకు వస్తుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. ఆకాంక్ష సింగ్ రష్మికలు హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.