అప్పుడు జయలక్ష్మి.. ఇప్పుడు అనకొండ

0బిచ్చగాడు మూవీతో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టేయడమే కాదు.. బోలెడంత ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ. కంటెంట్ ఉన్న డబ్బింగ్ సినిమాలకు బెంచ్ మార్క్ గా నిలవడమే కాదు.. ఆ ఏడాది పలు భారీ బడ్జెట్ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు.. టీఆర్పీలు సాధించిన తర్వాత.. మళ్లీ ఆ స్థాయిలో కాదు కదా.. నామమాత్రపు సక్సెస్ కూడా దక్కించుకోలేకపోయాడు.

ఇప్పుడు కాశి అంటూ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విజయ్ ఆంటోనీ. మే 18న ఈ మూవీ విడుదల కానుండగా.. ఇప్పుడా సినిమాకు సంబంధించి.. మొదటి 7 నిమిషాల వీడియోను నెట్ లో పెట్టేశారు. ఫారిన్ లో ఓ బడా డాక్టర్ పాత్రలో హీరో కనిపిస్తాడు. ఎవరికైనా సరే.. చూసేందుకు కూడా అసూయ పడేంతటి స్థాయి. కానీ ఇతడికి ఎప్పుడూ ఓ కల వస్తుంది. అందులో ఓ అనకొండ లాంటి పాము.. ఓ ఎద్దు కనిపిస్తాయి. పాము దాడి చేయడంతో పరిగెడుతున్న ఎద్దు.. ఓ పిల్లాడిని ఢీ కొనబోతుంది. ఇదే ఆ కల. ఇంతలోనే తనను తల్లిదండ్రులు దత్తత తీసుకున్నారని తెలుస్తుంది. అప్పుడు తన గతాన్ని వెతుక్కుంటూ వెళతాడు హీరో.

కొంతకాలం క్రితం బేతాళుడు అంటూ మళ్లీ విభిన్నమైన కంటెంట్ ఉన్న మూవీని అందించేందుకు ప్రయత్నించాడు. అప్పుడు కూడా ఇలాగే జయలక్ష్మి అంటూ పాటతో బాగానే హంగామా చేశాడు విజయ్ ఆంటోనీ. కాన్సెప్ట్ పై ఆసక్తి జెనరేట్ అయినా.. పునర్జన్మల థీమ్ తో రూపొందిన ఆ సినిమా మాత్రం ఆడలేదు. ఇప్పుడు కాశి చిత్రానికి కూడా మళ్లీ తన గతాన్ని వెతుక్కుంటూ వెళ్లే కథతోనే వస్తున్నాడు విజయ్ ఆంటోనీ. మరి ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాలి. కాకపోతే.. అప్పటి బిచ్చగాడు మాదిరిగానే.. ఇప్పుడు కూడా టాలీవుడ్ లో టఫ్ కాంపిటీషన్ లేని టైంలోనే వస్తున్నాడు ఈ తమిళ హీరో.