దేవరకొండను వారు వదిలేది లేదంటున్నారు

0

విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ – ‘గీత గోవిందం’ చిత్రాలతో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈయనతో సినిమాలు నిర్మించేందుకు – తెరకెక్కించేందుకు ప్రముఖ నిర్మాతలు మరియు దర్శకులు క్యూ కడుతున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విజయ్ దేవరకొండ ఇప్పుడు వంద కోట్ల హీరో అవ్వడంతో ఈయనతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించేందుకు కూడా నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. ఈ సమయంలోనే విజయ్ దేవరకొండ గతంలో కమిట్ అయిన సినిమాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

‘పెళ్లిచూపులు’ మరియు ‘అర్జున్ రెడ్డి’ చిత్రాల సక్సెస్ ల కారణంగా ఈయనకు పలువురు నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చారు. వచ్చిందే ఛాన్స్ అన్నట్లుగా దర్శకులను మరియు నిర్మాతలను పట్టించుకోకుండా విజయ్ దేవరకొండ ఓకే చెప్పాడు. అయితే గీత గోవిందం చిత్రంతో స్థాయి మారిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ చిన్న చిత్రాలను చేసేందుకు వెనుకా ముందు ఆడుతున్నాడు. మూడు చిన్న చిత్రాలకు కమిట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పటికే నందిని రెడ్డితో సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడు. వైజయంతి వారు ఇచ్చిన అడ్వాన్స్ ను విజయ్ తిరిగి ఇచ్చేశాడు. ఇక ఈయనకు కేఎస్ రామారావు అడ్వాన్స్ ఇచ్చాడు. కాంత్రి మాధవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కాల్సి ఉంది.

ప్రస్తుతం తనకున్న క్రేజ్ నేపథ్యంలో క్రాంతి మాధవ్ వంటి ఫ్లాప్ దర్శకుడితో సినిమా చేయడం వల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు. అందుకే నిర్మాత రామారావుకు అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వాలని భావించాడు. కాని ఆయన మాత్రం అడ్వాన్స్ అక్కర్లేదు. ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు సినిమా చేయమని అడుగుతున్నాడట. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాల్సిందే అని దర్శకుడు క్రాంతి మాధవ్ మరియు నిర్మాత రామారావు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్వాన్స్ తీసుకున్నాడు కనుక విజయ్ దేవరకొండ తప్పకుండా సినిమా చేయాల్సిందే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

కొరటాల వంటి దర్శకుడి నుండి ఛాన్స్ లు వస్తున్న నేపథ్యంలో క్రాంతి మాధవ్ వంటి చిన్న దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా చేస్తే ఆయన స్థాయి తగ్గుతుందనే ఆందోళనను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో విజయ్ దేవరకొండ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
Please Read Disclaimer