విజయ్ మేనియా.. అక్కడ కూడా..

0విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి మూవీలో జీవించేశాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా చూసిన వారందరూ టాలీవుడ్ కి మరో బెస్ట్ యాక్టర్ దొరికాడని సంబరపడిపోయారు. అందం హైట్ అన్ని కలగలిపిన విజయ్ కు యూత్ లో పిచ్చ క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తమిళనాట సైతం విజయ్ కు క్రేజ్ ఉందని తాజాగా జరిగిన ఓ సంఘటన ద్వారా నిరూపితమైంది.

తమిళ ఫిలిం సెలెబ్రెటీలు ప్రతిష్టాత్మకంగా భావించే ‘బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్’ కార్యక్రమం తాజాగా చైన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు తమిళ సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. భారీస్థాయిలో జరిగిన ఈ వేడుకకు తెలుగు ఇండస్ట్రీ నుంచి రాజమౌళితో పాటు విజయ్ – దేవీశ్రీప్రసాద్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విజయ్ కు ’దక్షిణాది సెన్సేషన్ అవార్డు’ వరించింది. ఈ అవార్డు అందుకోవడం కోసం రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తో కలిసి విజయ్ దేవరకొండ వేదిక మీదకు వచ్చాడు. ఈ సందర్భంగా ఆడిటోరియం .. విజయ్ ను చూసి ఈలలు గోలలు చప్పట్లో దద్దరిల్లింది.

అవార్డు అందుకున్న అనంతరం విజయ్ అక్కడున్న వారందరికీ షాక్ ఇచ్చాడు. తమిళం మాట్లాడి అభిమానులను అలరించాడు. విజయ్ ‘నోటా’ అనే తెలుగు – తమిళ ద్విభాష చిత్రంలో నటిస్తున్నాడు. ఇందుకోసం తమిళం నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ చెబుతున్నాట.. అందుకే తమిళంలోనే ప్రసంగం చేసేసరికి అక్కడున్న ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు..

ఈ సందర్భంగా విజయ్ తన తెలుగు సినిమాలను ఆదరించిన తమిళ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. తను తమిళంలో తీసే ‘నోటా’ కూడా ఆకట్టుకుంటుందని.. ఆ సినిమాతో వచ్చే ఏడాది కూడా ఈ అవార్డును మరోసారి తీసుకుంటానని చెప్పాడు. ప్రసంగం అనంతరం విజయ్ చేసిన ర్యాప్ వాక్ అలరించింది. తమిళనాడులోని మనోడికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసి అంతా అవాక్కయ్యారు.