అలాంటి సినిమాలు చేయనన్న దేవరకొండ

0

బహుశా తెలుగు ఏ వారసత్వం లేని హీరోల్లో విజయ్ దేవరకొండ అంత వేగంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో మరొకరు ఉండరేమో. మెగాస్టార్ చిరంజీవి సైతం తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకోవడానికి చాలా ఏళ్లు పట్టింది. కానీ విజయ్ మాత్రం హీరోగా పరిచయమైన రెండేళ్లకే పెద్ద స్టార్ అయిపోయాడు. ఈ విషయంలో స్వయంగా చిరంజీవే గొప్పగా చెప్పాడు. ఐతే తాను మాత్రం ఇంకా ఒక స్టార్ అయిపోయినట్లు ఫీలవ్వట్లేదని అంటున్నాడు విజయ్. ప్రతి సినిమా కూడా ఇదే చివరిది అన్న ఫీలింగ్ తోనే చేస్తున్నట్లు విజయ్ చెప్పాడు. ఐతే తాను ఈ విజయాలు అందుకోవడానికి ముందు.. ఇప్పుడు ఉన్న తేడా మాత్రం ఒక్కటే అని చెప్పాడు. ఇంతకుముందు తనకేదైనా సీన్ నచ్చకపోతే.. నచ్చలేదు అని చెప్పే స్థాయి లేకపోయేదని.. నచ్చినా నచ్చకున్నా చేయాల్సి వచ్చేదని.. కానీ ఇప్పుడు ఒక సీన్ సరిగా లేకుంటే చెప్పి మార్పించగలుగుతున్నానని అన్నాడు.

సినిమాల ఎంపికలో కానీ.. ఒక సన్నివేశం చేసేటపుడు కానీ.. తాను ఒక విషయంలో మాత్రం కచ్చితంగా ఉంటానని విజయ్ చెప్పాడు. అసహజంగా.. అసంబద్ధంగా ఉన్నది ఏదీ తాను చేయనన్నాడు. ఒక సీన్ చేసేటపుడు.. లేదా ఒక డైలాగ్ చెప్పేటపుడు నిజంగా ఇది నిజ జీవితంలో జరుగుతుందా అని ఆలోచిస్తానని.. అలా లేని పక్షంలో తాను చేయనని చెప్పాడు విజయ్. ‘అర్జున్ రెడ్డి’ విషయంలో కూడా ఒక చోట ఒక సీన్.. ఓ డైలాగ్ అసహజంగా అనిపించాయని.. వెళ్లి దర్శకుడు సందీప్ కు చెప్పానని.. అతను చాలా సేపు తనను కన్విన్స్ చేశాక వెళ్లి ఆ సీన్ చేశానని అన్నాడు. తన కొత్త సినిమా ‘నోటా’ విషయంలోనూ ఇలాగే జరిగిందని.. ఐతే దర్శకుడు ఆనంద్ శంకర్ అప్పటికప్పుడు కూర్చుని సీన్-డైలాగ్స్ మార్చాడని.. ఈ విషయంలో తాను రాజీ పడనని చెప్పాడు. తనకు రియల్ గా అనిపించకపోతే ఏ సినిమా కానీ.. ఏ పాత్ర కానీ చేయనని విజయ్ స్పష్టం చేశాడు. ఒక వేళ తాను కమర్షియల్ సినిమాలు చేసినా ఇంతే అని తేల్చి చెప్పాడు.
Please Read Disclaimer