గురుడికి ఇది అసలు పరీక్ష..!

0విజయ్ దేవరకొండ ఒక్కసారిగా యూత్ ఐకాన్ గా మారిపోయాడు. ఈయన ఏం చేసినా ఏం మాట్లాడినా కూడా అందరి దృష్టి ఈయనపై ఉంటుంది. గీత గోవిందం చిత్రంతో దాదాపు 70 కోట్ల వసూళ్లను సాధించిన ఈ హీరో త్వరలో ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీత గోవిందం చిత్రంకు అంత భారీ వసూళ్లు రావడంకు పూర్తి క్రెడిట్ విజయ్ దేవరకొండకే దక్కుతుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. అందుకే ఇప్పుడు నోటా చిత్రం కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ పై ఆధారపడి విడుదల కాబోతుంది. విజయ్ దేవరకొండపై నమ్మకంతో నోటా చిత్రంను కోట్లు పెట్టి అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయడం జరిగింది.

‘నోటా’ చిత్రంను అక్టోబర్ 4న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ‘నోటా’ విడుదలైన వారం లోపే ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ చిత్రంతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఎంత క్రేజ్ను కలిగి ఉన్నా కూడా ఎన్టీఆర్ చిత్రం ముందు నిలవడం కాస్త కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే నోటా చిత్రం విడుదల తేదీ విషయంలో నిర్మాతలు ఆలోచనలో పడ్డట్లుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే కనుక నిజం అయితే అరవింద సమేత విడుదలైన తర్వాత నోటా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

‘అర్జున్ రెడ్డి’ మరియు ‘గీత గోవిందం’ చిత్రాల సక్సెస్లో విడుదల తేదీలు కీలక పాత్రను పోషించాయి. ఈ రెండు చిత్రాలకు కూడా పెద్దగా పోటీ లేకపోవడంతో కలెక్షన్స్ వర్షం కురిపించాయి. ముఖ్యంగా గీత గోవిందం ఇంతగా వసూళ్లు రాబట్టడానికి కారణం బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రానికి పోటీ లేకపోవడమే అనే విషయం అందరికి విధితమే. ఇప్పుడు ‘నోటా’ చిత్రం పోటీ లేని సమయంలో విడుదల చేయడం కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ సత్తా చాటాల్సి ఉంటుంది. విజయ్ దేవరకొండకు ఇది అసలైన పరీక్ష అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పరీక్షలో ఈ గోవిందుడు పాస్ అవుతాడా లేదా అనేది చూడాలి.