విజయ్ దేవరకొండ మూడుముక్కలాట

0సినిమా పరిశ్రమలో సక్సెస్ ఎప్పుడు ఏ రూపంలో ఎలా వస్తుందో ఊహించడం చాలా కష్టం. అది వచ్చాక తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉంటాయి కానీ దాని కన్నా ముందు తీసుకున్నవి మాత్రం ఒక వింతైన స్థితిలోకి నెడతాయి. గీత గోవిందం సక్సెస్ తో తానే ఊహించని రేంజ్ కి వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ రానున్న సినిమాల మీద భారీ క్రేజ్ నెలకొనడమే పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాలు మూడు లైన్ లో ఉన్నాయి. నోటా ట్రైలర్ ఇప్పటికే విడుదల కాగా పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందటం అందులోనూ తమిళ దర్శకుడు డీల్ చేయటం వల్ల ఎంతవరకు మనవాళ్ళకు కనెక్ట్ అవుతుంది అనే దాని గురించి కొన్ని అనుమానాలు లేకపోలేదు. ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ యూత్ కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తో రూపొందినవే. కాని సున్నితమైన రాజకీయ నేపధ్యం మాత్రం అంత ఈజీగా తలకెక్కదు. అందుకే ఒకటి అరా మినహా ఈ బ్యాక్ డ్రాప్ లో వేరే హీరోలు చేసినవి కూడా ఓ మోస్తరు విజయం మాత్రమే సాదించాయి. దీని భవితవ్యం ఒక నెలలో తేలిపోతుంది.

ఇక బ్యాంకు ఇన్స్ టాల్మెంట్ లా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్న టాక్సీ వాలా మీద ఇప్పటికే బజ్ తగ్గిపోయింది. ఇప్పుడు వెంటనే రిలీజ్ చేసుంటే ఎలా ఉండేదో కాని నోటా తర్వాత కూడా వస్తుందా రాదా అనే అనుమానాల మధ్య మిగిలిన హైప్ ను కూడా చంపేస్తున్నారు. కొత్త దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ టేకింగ్ వల్లనో లేక కథలో తేడా కొట్టడం వల్లనో మొత్తానికి ఎప్పుడు వస్తుందో విజయ్ కు కూడా తెలియదు. ఇక మూడోది డియర్ కామ్రేడ్. దర్శకుడు భరత్ కమ్మకు ఇది డెబ్యు మూవీ. విప్లవాత్మక భావాలున్న విద్యార్ధిగా విజయ్ దేవరకొండ పాత్ర సీరియస్ గా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. మరి ఎంటర్ టైనింగ్ కి అలవాటు పడిన విజయ్ ఫ్యాన్స్ ఇలాంటివి ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. మొత్తానికి విజయ్ దేవరకొండ వంద కోట్ల ఇండస్ట్రీ హిట్ తర్వాత చాలా రిస్క్ తో కూడిన మూడుముక్కలాట ఆడుతున్నాడు. ఏ కార్డు తేడా కొట్టినా ఇబ్బందే. ఈ మూడూ గీత గోవిందం ఫలితం తేలకముందు ఒప్పుకున్నవి కావడంతో పునఃసమీక్షకు అవకాశం లేనంత దూరంలో షూటింగులు పూర్తి చేసుకుంటున్నాయి. సో రిజల్ట్ కోసం వేచి చూడటమే విజయ్ చేతుల్లో ఉన్నది.