రిస్క్ చేస్తున్నాడు.. ఫలితమేంటో?

0

విజయ్ దేవరకొండ ఇప్పుడు దక్షిణాదిన మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకడు. ‘నోటా’ సినిమా నిరాశ పరిచినా.. అందులో విజయ్ నటనకేమీ వంకలు పెట్టడానికి లేదు. ఇటు తెలుగులో.. అటు తమిళంలో విజయ్ పెర్ఫామెన్స్ పై ప్రశంసల జల్లు కురిసింది. ఈ సినిమా తేడా కొట్టిందంటే అది దర్శకుడి వైఫల్యమే తప్ప విజయ్ ది కాదు. స్వయంగా ‘నోటా’ దర్శకుడే విజయ్ ని తాను సరిగా ఉపయోగించుకోలేకపోయానని.. అతను అద్భుతమైన నటుడని అన్నాడు. ఇలాంటి నటుడితో పని చేయడం తన అదృష్టమని చెప్పాడు. విజయ్ లాంటి హీరోతో సినిమా అంటే ఏ దర్శకుడైనా ఆసక్తి చూపిస్తారనడంలో సందేహం లేదు. కొరటాల శివ లాంటి అగ్ర దర్శకుడే విజయ్ తో సినిమా చేయాలన్న కోరికను వ్యక్తం చేశాడు. ఇలాంటి హీరో ఇప్పుడు ఒక డిజాస్టర్ మూవీని అందించిన దర్శకుడితో పని చేయబోతున్నాడు.

ఆ దర్శకుడు మరెవరో కాదు.. క్రాంతి మాధవ్. కెరీర్ ఆరంభంలో ‘ఓనమాలు’.. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి మంచి సినిమాలు అందించిన క్రాంతి మాధవ్.. చివరగా ‘ఉంగరాల రాంబాబు’ లాంటి చెత్త సినిమా తీశాడు. ఐతే ఈ సినిమా రావడానికి ముందే విజయ్ అతడికి కమిట్మెంట్ ఇచ్చాడు. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ఐతే ‘ఉంగరాల రాంబాబు’ దారుణమైన ఫలితాన్నందుకోవడం.. మరోవైపు విజయ్ ‘అర్జున్ రెడ్డి’.. ‘గీత గోవిందం’ సినిమాలతో తిరుగులేని స్థాయిని అందుకోవడంతో అతను క్రాంతితో నిజంగా సినిమా చేస్తాడా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇంతకుముందు నందిని రెడ్డికి ఇలాగే కమిట్మెంట్ ఇచ్చి తర్వాత వెనక్కి తగ్గాడు విజయ్. క్రాంతికి కూడా అలాగే హ్యాండిస్తాడేమో అనుకున్నారు. కానీ అలా ఏమీ చేయకుండా మాట నిలబెట్టుకున్నాడు. కానీ ఆల్రెడీ ‘నోటా’ తేడా కొట్టిన నేపథ్యంలో విజయ్.. క్రాంతితో సినిమా చేయడం అంటే రిస్కే మరి ఇంత రిస్క్ చేస్తున్న విజయ్ కి క్రాంతి ఎలాంటి సినిమా అందిస్తాడు అన్నది ఆసక్తికరం. ‘ఉంగరాల రాంబాబు’ సంగతి మరిచిపోయి.. మళ్లీ తన శైలిలోకి మారి.. క్రాంతి మాధవ్ మంచి సినిమా అందించకపోతే గొప్ప అవకాశాన్ని వృథా చేసుకున్నట్లే.
Please Read Disclaimer