ఈ కామ్రేడ్ ఆంధ్రా బుల్లోడంట!

0`అర్జున్ రెడ్డి`గా కనిపించినప్పుడు దేవరకొండలోని కామ్రేడ్ బయటపడ్డాడు. అతడిలోని రెబలిజం బయటికొచ్చింది. హీరోయిజానికి కావాల్సిన చాకచక్యం ఏంటో దేవరకొండను చూస్తే అర్థమవుతుంది. అతడిలోని వాడి వేడి అంత స్పెషల్. అందుకే `ఎవడే సుబ్రమణ్యం` సినిమా తర్వాత ఎదురే లేకుండా దూసుకెళుతూనే ఉన్నాడు. `పెళ్లి చూపులు` చిత్రంలోనే తనలోని సత్తా అంతా చూపించాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి అవకాశాన్ని ఏమాత్రం మిస్ యూజ్ చేయలేదు. యూత్ గుండె కొల్లగొట్టడానికి ఉన్న ఏ అవకాశాన్ని విజయ్ దేవరకొండ అస్సలు వదిలిపెట్టలేదు. ప్రతిసారీ స్క్రిప్టు పరంగా ఏదో ఒక కొత్తదనం కోరుకుంటూ తెలివైన ఎంపికలతో ముందుకెళుతున్నాడు. పనిలో పనిగా అగ్ర బ్యానర్లకు కమిటై అతడు భారీ ప్లానింగుతో దూసుకొస్తున్నాడు.

కెరీర్ స్పీడ్ లో ఏదో ఒకటి చేసెయ్యకుండా తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటూనే ముందుకెళుతున్న తెలివైన కామ్రేడ్ .. విజయ్. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2లో గీతగోవిందం చిత్రంలో నటిస్తున్నాడు. అటుపై మైత్రి మూవీస్ లో `డియర్ కామ్రేడ్` అంటూ మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ తో దూసుకొస్తున్నాడు. ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. తూ.గో జిల్లా(ఏపీ) తొండంగిలో చిత్రీకరణ మొదలెట్టారు. యువ ప్రతిభాశాలి భరత్ కమ్మ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తోంది.

ఈ సినిమాలో విజయ్ పాత్ర ఇంట్రెస్టింగ్. ఫైట్ ఫర్ వాట్ యు లవ్ – అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామాలో విజయ్ ఆంధ్రా అబ్బాయిగా కనిపించనున్నాడు. ఆంధ్రా స్లాంగ్ లో అతడు చెప్పే డైలాగులు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. సామాజిక బాధ్యత ఉన్న పాత్రలో మెరిపిస్తాడని చెబుతున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చనున్న ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.