దేవరకొండ.. అక్కడ మనసు దోచేశాడు

0

విజయ్ దేవరకొండ సినిమాల్లో మాదిరే బయట కూడా జనాల్ని ఎంటర్టైన్ చేస్తుంటాడు. తనదైన యాటిట్యూడ్ తో అతను వ్యవహరించే తీరు.. మాట్లాడే మాటలు జనాలకు కొత్తగా అనిపిస్తుంటాయి. అతడి ప్రసంగాల్ని అందరూ చాలా ఆసక్తిగా వింటుంటారు. ‘నోటా’ పెద్ద డిజాస్టర్ అయ్యాక కూడా విజయ్ తో పెద్ద మార్పేమీ లేదు. అతను తన యాటిట్యూడ్ ఏమీ మార్చుకోలేదు. తన కొత్త సినిమా ‘ట్యాక్సీవాలా’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పైరసీ చేసిన వాళ్లకు కౌంటర్ ఇచ్చిన తీరు చర్చనీయాంశం అయింది. సినిమాను లీక్ చేసిన.. పైరసీ చూసిన వాళ్లపై అతను మామూలుగా సెటైర్లు వేయలేదు. ఎడిటింగ్ కూడా కాకముందు.. సౌండ్ లేకుండా మూడున్నర గంటల రఫ్ కట్ ఎలా చూశార్రా బై అంటూ గట్టిగానే తగులుకున్నాడు జనాల్ని.

ఆ సంగతలా ఉంటే.. సినిమా అనేది జనాలకు ఎంటర్టైన్మెంటే కానీ.. అందులో పని చేసిన వాళ్లకు జీవితం అంటూ అతను ఉదాహరణలు చెప్పిన తీరు అందరినీ ఆలోచింపజేసింది. పైరసీ చేసేవాళ్లు.. చూసేవాళ్లలోనూ ఆలోచన రేకెత్తించేలా అతను మాట్లాడాడు. తన కాలేజీలో జూనియర్ అయిన విష్ణు అనే కుర్రాడు ఎలా ఫొటోగ్రఫీ చేసుకుంటూ స్వశక్తితో బతుకుతున్నాడో.. తన బలవంతం మీద ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి ఎలా మెప్పించాడో చెప్పి.. ‘ట్యాక్సీవాలా’ బాగా ఆడితే అతను జీవితంలో స్థిరపడతాడని చెప్పాడు. ఇక కేరళకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ తన తండ్రికి క్యాన్సర్ అని తెలిసినా.. అంతటి కష్ట కాలంలోనూ ఈ సినిమా మీద ప్రేమతో పని చేశాడని.. కొచ్చి-హైదరాబాద్ మధ్య ఎన్నోసార్లు తిరిగాడని అన్నాడు. ఇక ‘ట్యాక్సీవాలా’కు రచన చేసిన సాయి.. ఈ సినిమా మొదలు కావడానికి ముందు తన పొలాన్ని అమ్మకానికి పెట్టాడని.. ఐతే నిర్మాణ సంస్థ నుంచి కొంచెం డబ్బులు రావడంతో ఆ ఆలోచన పక్కన పెట్టాడని చెప్పాడు. హీరోయిన్ ప్రియాంక సైతం ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుందని.. పైరసీ గురించి తెలిసినపుడు నరక యాతన అనుభవించిందని తెలిపాడు. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ సినిమాల మీద ప్యాషన్ తో ఎన్నో కష్టాలు పడ్డాడని.. చివరికి ఓ పెద్ద సంస్థలో ‘ట్యాక్సీవాలా’ తీసే అవకాశం వచ్చిందని.. తనేంటో రుజువు చేసుకునేందుకు కొన్నేళ్ల పాటు కష్టపడ్డడాడని అన్నాడు. ఇలా ఇంత మంది ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారని.. వాళ్ల జీవితాలు దీంతో ముడి పడి ఉన్నాయని.. జనాలు ఇది ఆలోచించకుండా సినిమాను లీక్ చేసి.. పైరసీని వ్యాప్తి చేస్తే ఎలా అని అతను ప్రశ్నించాడు.
Please Read Disclaimer