అర్జున్ రెడ్డి రౌడీ ప్రేమ

0స్టార్ అయినా అప్ కమింగ్ హీరో అయినా అభిమానుల అండదండలు చాలా ముఖ్యం. స్వర్గీయ ఎన్టీఆర్ మొదలుకుని ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతున్న యూత్ హీరోస్ దాకా అందరికి ఇది వర్తిస్తుంది. విజయ్ దేవరకొండకు ఇది తెలియనిది కాదు. కానీ అందరు నడిచే రూట్ లో వెళ్తే తన ప్రత్యేకత ఏముంటుంది అని ఆలోచించిన ఈ యూత్ ఐకాన్ ఫాన్స్ మనసులు గెలుచుకోవడంలో కూడా కొత్త పద్ధతులు అనుసరిస్తున్నాడు. ఆ మధ్య తన పుట్టిన రోజు వేసవిలో ఉన్న కారణంగా హైదరాబాద్ సిటీ మొత్తం వ్యాన్స్ పెట్టి మరీ ఉచితంగా ఐస్ క్రీం పంచిన విజయ్ దేవరకొండ ఫిలిం ఫేర్ అవార్డు వేడుక సందర్బంగా చేసిన మరో వినూత్న ప్రయత్నం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

హీరోగా సంఘంలో తాను ఎలాంటి అనుభూతిని పొందుతున్నానో దాన్ని ఫాన్స్ కి కూడా ఇవ్వాలన్న తలంపుతో విజయ్ ఈ మధ్య రౌడీక్లబ్ పేరుతో ఒక వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో రిజిస్టర్ చేసుకోమని ఫాన్స్ కి ఆహ్వానం ఇచ్చాడు. ఇంకేముంది వేలాదిగా యువతీ యువకులు తమ పేర్లు అందులో నమోదు చేసుకున్నారు . ఇచ్చిన మాట ప్రకారం సంగారెడ్డి జిలా జహీరా బాద్ కు చెందిన ప్రశాంత్ అనే ఎంబిఎ చదువుతున్న కుర్రాడిని సెలెక్ట్ చేసుకుని తనతో పాటు ఫిలిం ఫేర్ ఫంక్షన్ కు తీసుకెళ్లాడు విజయ్ దేవరకొండ. ఊరికే కాదు. ఈవెంట్ కు తాను ఏదైతే సూట్ వేసుకోవాలని ఎంచుకున్నాడో అచ్చం అలాంటిదే ప్రశాంత్ కు కూడా తనే కుట్టించి మేకప్ చేయించి తనతో కూడా ఫిలిం ఫేర్ ఈవెంట్ కు తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకున్నాడు.

అంతే కాదు రౌడీ అనే పదం ఏదైతే ప్రత్యేకంగా ఎంచుకుని ఫాన్స్ కోసం పెట్టుకున్నాడో దాన్ని లోగో గా ఇద్దరి సూట్స్ వెనుక ప్రింట్ చేయించి ప్రశాంత్ కు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చాడు. గతంలో అర్జున్ రెడ్డి-ద్వారకా సినిమాలు విడుదలైనప్పుడు కూడా విజయ్ ఇలాగే ఫ్రీగా టికెట్లు ఇప్పించి అభిమానుల మనసులు గెలుచుకోవడం తెలిసిందే. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచిస్తూ ఫాన్స్ కు దగ్గరవుతున్న విజయ్ దేవరకొండ టాక్సీ వాలా విడుదల తేదీ కోసం ఎదురు చూస్తోంది. అర్జున్ రెడ్డి తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.