స్మోక్ చేయని విజయ్ ఇంకా స్టైలిష్ అట!

0తమిళ స్టార్ హీరో – ఇళయ దళపతి విజయ్ – విలక్షణ దర్శకుడు మురుగదాస్ ల కాంబోలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం `సర్కార్` ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. చేతిలో సిగరెట్ – లైటర్….బ్యాక్ డ్రాప్ లో చెన్నైసిటీ….ఇలా స్టైలిష్ గా ఉన్న ఫస్ట్ లుక్ విజయ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మెర్సల్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్….సర్కార్ తో మరో హిట్ కొడతాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ గెటప్ పై తమిళనాడు ఎంపీ అంబుమణి రామదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిగరెట్ తాగకుండా ఉంటే విజయ్ ఇంకా స్టైలిష్ గా కనిపించేవారంటూ రామదాస్ ట్వీట్ చేశారు. ధూమపానం ప్రాణాలు తీస్తుందని అది క్యాన్సర్ కు కారకమని హ్యాష్ ట్యాగ్ లను జత చేశారు.

దాంతోపాటు గతంలో విజయ్ ఇంటర్వ్యూ ఇచ్చిన ఓ వార్తను పోస్ట్ చేశారు. తన సినిమాల్లో పొగతాగనని ఆ ఇంటర్వ్యూలో విజయ్ చెప్పారని కానీ ఇప్పుడు తాగారని అన్నారు. పొగతాగడాన్ని విజయ్ ప్రమోట్ చేయడం సిగ్గుపడాల్సిన విషయని అన్నారు. బాధ్యతగా వ్యవహరించండి ధూమపానాన్ని ప్రోత్సహించకండి అనే హ్యాష్ట్యాగ్లను జత చేశారు. అయితే రామదాస్ ట్వీట్లపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. ‘మెర్సల్’ సినిమాలో కూడా విజయ్ సిగరెట్ తాగారని అపుడు రామదాస్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 2002లో విడుదలైన `బాబా` సినిమాలో రజనీకాంత్ సిగరెట్ తాగడంపై అంబుమణి తండ్రి ఎస్. రామదాస్ విమర్శలు గుప్పించారు. సిగరెట్ తాగుతూ యువతను రజనీ తప్పుదారి పట్టిస్తున్నారంటూ రచ్చ చేశారు. గతంలో విడుదలైన `మెర్సల్ ` సినిమాపై కూడా కొందరు బీజేపీ నేతలు నానా గొడవ చేసిన విషయం విదితమే.